బండారుపై విష్ణు చక్రం !

ఏపీ అసెంబ్లీలో బీజేపీ పక్ష నాయకుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఇటీవల కాలంలో మిత్రపక్షంతోనే కయ్యానికి కాలు దువ్వుతున్నారు. తెలుగుదేశం పాలనలో అవినీతి తారస్ధాయికి చేరిందని ఇటీవల వ్యాఖ్యానించి తమ్ముళ్లకు గుస్సా తెప్పించిన విష్ణుకుమార్‌రాజు అంతటితో ఆగకుండా టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్న పెందుర్తి నియోజకవర్గంలో వేలు పెట్టారు.

అక్కడ ముదపాక గ్రామంలో రైతుల భూములను టీడీపీ నేతలు కారు చౌకగా కొల్లగొడుతున్న వైనాన్ని వెలుగులోకి తేవడమే కాకుండా ఏకంగా జిల్లా కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేయడంతో వ్యవహారం ముదిరిపాకాన పడుతోంది. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో కోటి రూపాయలు విలువ చేసే భూములను కేవలం పది లక్షలకే అప్పనంగా చేజిక్కించుకుంటున్న పసుపు తమ్ముళ్ల వ్యవహారం దీంతో బట్టబయలైంది. ఈ మొత్తం తతంగం వెనుక టీడీపీ సర్పంచ్‌ ఉన్నారని విష్ణు ఆరోపించడమే కాకుండా ఆయనపైన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. 
బాధితులను వెంటపెట్టుకుని కలెక్టర్‌ను స్వయంగా కలసి విచారణను కోరిన బీజేపీ ఎమ్మెల్యేపై పెందుర్తి టీడీపీ ఎమ్మెల్యే బండారు ఫైర్‌ అవుతున్నారు. తన నియోజకవర్గంలో వేలు పెట్టడానికి ఆయనెవరంటూ నిలదీస్తున్నారు. ఇంతటితో ఆగకుండా తన నియోజకవర్గంలోని వైసీపీ నేతలతో దోస్తీ కట్టి తనను బదనాం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇదిలా ఉండగా, జిల్లావ్యాప్తంగా టీడీపీ నేతలు ల్యాండ్‌ పూలింగ్‌ జీవోను  అడ్డం పెట్టుకుని ఎకరాలకు ఎకరాలను పేద రైతుల నుంచి కాజేస్తున్నారు. ఇందులో ఓ మంత్రి గారి సన్నిహిత బంధువు కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇక, ప్రభుత్వ భూములలో స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్న వారికి వంద గజాల లోపు ఉచితంగా పట్టాలు ఇస్తూ బాబు సర్కార్‌ జారీ చేసిన మరో జీవోను సైతం జిల్లాలో తప్పు తోవ పట్టిస్తూ టీడీపీ తమ్ముళ్లు ఈ ఉచితాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎకరాలకు ఎకరాలు సర్కారీ భూములను తీసేసుకుని వాటిని వందల గజాలుగా చూపిస్తూ బినామీ లబ్దిదారుల ద్వారా ప్రభుత్వం నుంచి ఉచిత పట్టాలను పొందారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఓ సీనియర్‌ ఎమ్మెల్యే నియోజకవర్గంలో భూ దందా సాగడం, దానిని సాటి మిత్రపక్ష ఎమ్మెల్యే వెలుగులోకి తేవడంతో జిల్లా టీడీపీ నేతలు ఇరకాటంలో పడ్డారు. మరి, దీనిపై రెండు పార్టీల పెద్దలు ఒక్కటై విచారణను నిలుపు చేస్తాయా, లేక ముందుకు వెళ్తారా అన్నది చూడాల్సి ఉంది.

Show comments