స్థూలకాయం సమస్య... చికిస్థ..!

స్థూలకాయం సమస్య వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబ పరంగానూ, సామాజికపరంగానూ తీవ్రస్థాయిలో ఆరోగ్య సమస్యలను సృష్టిస్తోంది. ప్రస్తుతం దాదాపు 40% మంది స్త్రీలు, 20% మంది పురుషులు ఏ సమయంలో చూసినా స్థూలకాయాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒబేసిటీ ట్రీట్‌మెంట్స్‌ పేరిట లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. బరువు తగ్గడం పెద్దగా సమస్య కాకపోయినప్పటికీ తగ్గిన బరువును నిలబెట్టుకోవడం క్లిష్టసమస్యగా తయారవుతోంది. సత్వరఫలితాల మోజులో క్రాష్‌ వెయిట్‌లాస్‌ ప్రాగ్రామ్స్‌లో పాల్గొని బరువును తగ్గిన వారిని గమనిస్తే కోల్పోయిన బరువులో సుమారు 75% మొదటి సంవత్సరంలోనే తిరిగి వచ్చేస్తుంది. మిగిలిన 25% బరువు కూడా మరొక ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిగా తిరిగి వచ్చి చేరుతుంది. అయితే స్థూలకాయం సమస్యను చిట్కాల రూపంలో పరిష్కరించుకోవాలని చూడకుండా సరైన అవగాహనతో ప్రయత్నిస్తే సత్ఫలితాలను పొందవచ్చు. ఈ నేపథ్యంలో స్థూలకాయానికి సంబంధించి ఆయుర్వేదం ఏ చెబుతుందో, ఆయుర్వేద చికిత్సావిధానాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. 

ఒబేసిటి అంటే? 

శరీరంలో పరిమితికి మించి కొవ్వు సంచితమైనప్పుడు మేదోరోగం లేదా ఒబేసిటి అంటారు. శక్తి నిలువలు శారీరక అవసరాలకు మించి తయారైనప్పుడు జీవక్రియలో సమతుల్యం దెబ్బతిని కొవ్వు చేరుతుంది.

పరిశీలనలు, అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? Readmore!

 *పెద్దల్లో 80 శాతంమంది అధికబరువు కలిగి ఉన్నారు!

*చిన్నపిల్లల్లో  25 శాతంమంది అధికబరువు కలిగి ఉన్నారు !

*మధుమేహ వ్యాధి 80 శాతం కేసుల్లో స్థూలకాయం వల్ల ప్రాప్తిస్తోంది !

*గుండెజబ్బులు 70 శాతం కేసుల్లో స్థూలకాయం వల్ల ప్రాప్తిస్తున్నాయి !

*రొమ్ముక్యాన్సర్‌, పెద్దపేగు క్యాన్సర్లు 42 శాతం కేసుల్లో స్థూలకాయం వల్ల ప్రాప్తిస్తున్నాయి !

*అధికరక్తపోటు 26 శాతం కేసుల్లో స్థూలకాయం వల్ల ప్రాప్తిస్తోంది !

ఆయుర్వేద దృక్పథం

ఆయుర్వేద చికిత్సా గ్రంథం చరక సంహిత కొవ్వు అనియంతగా పెరిగిపోవడాన్ని మేదోరోగం అనే పేరుతో వివరించి చికిత్సలను సూచించింది. మేదస్సు అంటేకొవ్వు పదార్ధమని అర్ధం. రసరక్తాది ఏడు ధాతువుల్లో మేదో ధాతువు ఒకటి. ఒక ధాతువు మరో ధాతువును వృద్ధి పరుస్తుంది. వివిధ కారణాలవల్ల కఫప్రకోపం జరిగినప్పుడు ఉత్తరధాతు పోషణ జరగకుండా మేదోధాతువు మాత్రమే పేరుకుపోయి మేదోరోగం ప్రాప్తిస్తుంది. ఆయుర్వేదం స్థూలకాయం వ్యాధి సమగ్ర స్వరూపాన్ని విశ్లేషించి చికిత్సాపరంగా ప్రధాన్యతను కల్పించింది. ఉదాహరణకు, అష్టనిందిత వ్యక్తులను గురించి పేర్కొంటూ స్థూలకాయులను చేర్చింది. ఇతరుల నుంచి అకారణంగా నిందలు ఎదుర్కొనే వారిని అష్టనిందిత వ్యక్తులంటారు. మేదోరోగ పీడితులు ఈ వర్గానికి చెందుతారు. 

ఆయుర్వేదం సూచించే పరిష్కార మార్గాలు. 

సౌందర్య సమస్యా, ఆరోగ్య సమస్యా ? 

స్థూలకాయం అనేది వైద్య సంబంధమైన సమస్య. సౌందర్య సమస్యకాదు. ఎన్నెన్నో క్లిష్టమైన శాస్త్రీయాంశాలు దీనిలో ఇమిడి ఉన్నాయి. కీళ్ళు, వెన్నెముక వ్యాధిగ్రస్థం కావడం, హెర్నియా రావడం, కాళ్లపైన సిరలుతేలడం, పని చేసేప్పుడు ఆయాసం రావడం, శ్వాసకోశ వ్యాధులు ఉత్పన్నం కావడం మొదలైన అనేక అనుబంధ సమస్యలు స్థూలకాయంతో ముడిపడి ఉంటాయి. అంతేకాదు, స్థూలకాయులకు మధుమేహం, కొలెస్ట్రాల్‌ పెరిగిపోవడం, గాల్‌ బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడటం, గౌట్‌ వంటివి స్థితిగతులెన్నో ప్రాప్తించే అవకాశముంది. స్థూలకాయంవల్ల గుండె మీద అదనపు వత్తిడి పడి బలహీనంగా తయారయ్యేందుకు అవకాశముంది. స్టీరాయిడ్స్‌ను, గర్భనిరోధక మాత్రలను, ఇన్సులిన్‌ మొదలైన మందులు వాడేవారిలో ఆకలి పెరిగి బరువు కూడా పెరుగుతుంది. మరో ముఖ్య విషయం- కిడ్నీ, లివర్‌, గుండె జబ్బుల కారణంగా శరీరంలో నీరు చేరి స్థూలకాయంగా భ్రమను కలిగిస్తుంది. కాబట్టి అధిక బరువును కేవలం సౌందర్యపరమైన సమస్యగా కాకుండా వైద్యపరమైన సమస్యగా పరిగణించి చికిత్స చేయాలి. 

స్థూలకాయం మీద ఇతర వ్యాధుల ప్రభావం

వంశపారంపర్యత, ఆహారపుటలవాట్లు, అచేతన జీవనవిధానం, జీవరసాయనాల పనితీరులో మార్పు, కార్టికోస్టీరాయిడ్స్‌ వాడకం, హైపోథైరాయిడిజం, కూషింగ్స్‌ సిండ్రోమ్‌ (కార్టిసాల్‌ హార్మోన్‌ సమస్య),  పాలిసిస్టిక్‌ ఓవరి డిసీజ్‌, నిస్త్రాణ, నీరసం, బడలిక, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, పక్షవాతం, మధుమేహం (టైప్‌2), గాల్‌బ్లాడర్‌లో రాళ్లు, కీళ్లనొప్పులు తీవ్రతరమవటం, కొన్ని క్యాన్సర్ల రిస్కు పెరగటం,  రక్తంలో గడ్డలు తయారవటం, చర్మపు ఇన్ఫెక్షన్లు, గౌట్‌, సంతాన రాహిత్యం, స్లీప్‌ ఎప్నియా, ఆత్మవిశ్వాసం కొరవడటం, కుంగుబాటు ఈ స్థితులకూ అధికబరువుకూ సంబంధం ఉంటుంది. స్థూలకాయం ఈ స్థితలకు కారణంగాగాని, లేదా ఫలితంగాగాని ఉండవచ్చు. 

అవసరానికి మించి తినటం

అవసరం లేకుండా రోజూ 30గ్రాముల ఇడ్లీ అదనంగా తిన్నా, లేదా పావుగంట నడకకు వాహనం ఉపయోగించినా 60 క్యాలరీల శక్తి శరీరంలో నిల్వ ఉంటుంది. ఇలా 4 ఏళ్లు జరిగితే 10 కిలోలు పెరుగుతారు! అతిగా కొవ్వు పదార్థాలను తినడం వలన అవికొవ్వు కణజాలాలలోకి వెళ్లి వాటినిండా ఆక్రమిస్తాయి. ఎప్పుడైతే కొవ్వుకణాల పరిమితి దాటుతుందో అప్పుడవి విభజన చెందుతాయి. అంటే వాటి కణాల సంఖ్య పెరుగుతుందన్నమాట. ఒకసారి కొవ్వుకణాల విభజన జరిగితే వాటి సంఖ్య తిరిగి తగ్గదు కనుక  బరువు తగ్గడం సమస్యగా తయారవుతుంది.

అచేతనమైన జీవన శైలి

పనిలేకుండా స్తబ్దంగా, వ్యాయామ రహితంగా జీవితం గడిపేవారిలో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఎక్కువ. 

షిఫ్ట్‌ ఉద్యోగాలు 

నిశాచరత్వం వల్ల శరీరంలో జీవక్రియలు గాడితప్పుతాయి. అస్తవ్యస్తమైన పనిగంటలు, నైట్‌ షిఫ్టుల్లో పనిచేసేవారిలో ఆహారసమయాల్లో తేడాలవల్ల శరీరక్రియ అపక్రమంగా తయారై ఒబేసిటి ప్రాప్తిస్తుంది. 

శారీరక రుగ్మతలు 

హార్మోన్ల తేడాలు (థైరాయిడ్‌సమస్యలు, కూషింగ్స్‌ సిండ్రోమ్‌), జన్యుపరమైన వ్యాధులూ ఒబేసిటి రిస్కును పెంచుతాయి.

సూచనలు : ఏక రసభోజనం నింద్యం 

అన్ని వర్గాలకు చెందిన ఆహారాలను తీసుకుంటుం డాలి. ఒకే రకం ఆహారానికే పరిమితం కాకూడదు. దీనినే షడ్రసోపేతమైన ఆహారం అంటుంది ఆయుర్వేదం. ఆహారంలో పిండి పదార్థాలను 60%, మాంసకృత్తులు 20%, కొవ్వు పదార్థాలు 20% ఉండేలా చూసుకోవాలి. 

ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి

మాంసాహారులైతే ఎర్రని మాంసానికి బదులు తెల్లని మాంసం ఎంచుకోవాలి. అంటే మేక, గొర్రె, పోర్క్‌, బీఫ్‌కు బదులు చర్మం తొలగించిన కోడి, చేపల మాంసం తినాలి. గుజ్జు కలిగిన తియ్యని పండ్లు, డ్రైఫ్రూట్స్‌ బదులు రసం కలిగిన తాజా పండ్లు తీసుకోవాలి. ఆహార పదార్థాలను ఫ్రై (నూనెలో వేయించటం) చేసే బదులు రోస్ట్‌ (నిప్పుల మీద వేడి చేయటం) చేయాలి. ఎక్కువ నూనెను వాడాల్సిన వంటపాత్రల బదులు మూకుడు, ఓవెన్‌, నాన్‌స్టిక్‌ ఫ్రయింగ్‌ ప్యాన్‌, ప్రెషర్‌ కుక్కర్‌ వంటివి వాడాలి. కూల్‌ డ్రింక్స్‌, టీ, కాఫీ తాగే బదులు మినరల్‌ వాటర్‌, బబుల్‌ వాటర్‌, డైట్‌ డ్రింక్స్‌ తీసుకోవాలి. వడ్డనకు పెద్ద గరిటెలు, వెడల్పాటి ప్లేట్లు వాడే బదులు చిన్నసైజ్‌ టేబుల్‌ స్పూన్లు, చిన్న ప్లేట్లు వాడాలి. 

తేనెను వాడితే మంచిది

తేనె తీసుకుంటే స్థూలకాయంలో చక్కని ఫలితం కనిపిస్తుంది. కాకపోతే, ఏడాది కాలం పాటు నిల్వ ఉంచిన పాత తేనెను వాడాలని ఆయుర్వేద శాస్త్రం సూచిస్తుంది. పాత తేనెకు రూక్షం (స్నిగ్దత్వాన్ని తగ్గించటం), గ్రాహి (ద్రవరూప స్రావాలను ఎండిపోయేలా చేయటం), లేఖనం (కొవ్వును గీరేసి వదులయ్యేలా చేయటం), కఫహరం (శ్లేష్మాన్ని తగ్గించటం) అనే గుణాలు ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం గ్లాసు గోరువెచ్చని నీళ్లకు రెండు చెంచాలు తేనెను చేర్చి తీసుకోవాలి. తేనెను నీళ్లకు చేర్చి తీసుకోవటం వల్ల వ్యాయామ సమయంలో నీరసం రాకుండా ఉంటుంది. అవసరమైతే ఈ మిశ్రమానికి చెక్క నిమ్మరసం కూడా చేర్చి తీసుకోవచ్చు. 

చింతనతో స్థూలకాయ చింత దూరం

శరీరంలో అధికంగా కొవ్వు చేరకుండా ఉండాలంటే అనుక్షణం చింతన (ఆలోచన) చేయాలని ఆయుర్వేదం చెబుతుంది. బాధ్యతారహితమైన జీవన విధానం వల్ల స్థూలకాయం సిద్ధిస్తుంది. 

వ్యాయామం చేయటం అవసరం స్థూలకాయం రాకుండా ఉండాలంటే ప్రతినిత్యం అర్ధశక్తిగా వ్యాయామం చేయాలని ఆయుర్వేదం సూచిస్తుంది. యోగాసనాలు, ఎండ (ఆతపం), సైక్లింగ్‌ (వాహనయానం), నడక (మార్గాయానం), ప్రాణాయామం, ఈత, క్రీడలు, జిమ్‌, ఎయిరోబిక్స్‌ వంటివాటిల్లో ఏది అనువుగా ఉంటే దానిని ఎంచుకొని సాధన చేయాలి. వ్యాయామానంతరం నల్లతుమ్మ ఆకులను, కరక్కాయల చూర్ణాన్నీ కలిపి శరీరానికి నలుగు పెట్టుకుంటే స్వేదాధిక్యత తగ్గుతుంది.

డా.చిరుమామిళ్ళ మురళీ మనోహర్ 
9177445454

Show comments