వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకే ఎందుకిలా.?

జలీల్‌ఖాన్‌.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే. ఎస్వీ మోహన్‌రెడ్డి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి గెలిచారు గనుక, ఇప్పటికీ వీరిని వైఎస్సార్సీపీకి చెందిన ప్రజా ప్రతినిథులుగానే భావించాలి. సాంకేతికంగా ఈ ఇద్దరూ వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేలే. టీడీపీలో చేరారు గనుక, తెలుగుదేశం పార్టీ నేతలవుతారేమోగానీ, ప్రజా ప్రతినిథులుగా వీరికి ప్రాతినిథ్యం దక్కుతోన్నది వైఎస్సార్సీపీ జెండా కారణంగానే.! 

ఇక, అసలు విషయమేంటంటే అటు జలీల్‌ఖాన్‌, బీకాంలో ఫిజిక్స్‌ వుందని వ్యాఖ్యానించి, సోషల్‌ మీడియాలో 'ట్రెండింగ్‌' అయితే, ఎస్వీ మోహన్‌రెడ్డి ఏకంగా, డిగ్రీలోకి సీఈసీని తీసుకొచ్చేశారు. అసలు, ఇంటర్మీడియట్‌లో సీఈసీ వుండేది కాదు గనుక, డిగ్రీలోకి వచ్చాక సీఈసీ చేశానన్నారు. ఎంపీసీ, ఎంపీటీసీల్లేవంటూ ఏవేవో మాట్లాడేసి వార్తల్లోకెక్కారు ఎస్వీ మోహన్‌రెడ్డి. 

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకే ఎందుకిలా జరుగుతోంది.? వైఎస్సార్సీపీ జెండా మోసినన్నాళ్ళూ ఎక్కడా ఎలాంటి పొరపాట్లూ జరగలేదు. కానీ, టీడీపీలోకి చేరినాకనే ఆయా నేతలు అడ్డదిడ్డంగా మాట్లాడుతూ, తమను తామే నవ్వులపాల్జేసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. పార్టీ మారడంతోనే, నేతలు తామేం మాట్లాడుతున్నారో తెలియని 'స్థితిలోకి' వెళ్ళిపోయారనుకోవాలా.? ఏమో మరి, అలాగే అనుకోవాల్సి వస్తోంది. 

జలీల్‌ఖాన్‌ వ్యవహారమైతే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. ఇకనుంచి ఎస్వీ మోహన్‌రెడ్డి గురించి దేశమంతా చర్చించుకోవాలేమో.! ఏదో, పబ్లిసిటీ కోసం అలా అన్నాననీ, అలా అనబట్టే అంతా తన గురించి మాట్లాడుకుంటున్నారనీ, చేసిన పొరపాటుకి 'కవరింగ్‌' ఇచ్చుకున్నారు జలీల్‌ఖాన్‌. ఇకపై ఎస్వీ మోహన్‌రెడ్డి కూడా అదే చెయ్యాలేమో.! 

టీడీపీ అధినేత చంద్రబాబు పుత్రరత్నం నారా లోకేష్, వర్దంతికీ, జయంతికీ తేడా తెలియకుండా వ్యవహరిస్తారు. టీడీపీని అవినీతి పార్టీ అంటారు.. టీడీపీని అవినీతి పార్టీ అంటారు.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి అంటారు. ఇదంతా చంద్రబాబు మార్కు ట్రెయినింగ్‌కి పరాకాష్టగా భావించాల్సి వుంటుంది.

Show comments