కోలీవుడ్‌ లేడీ రెబల్‌ స్టార్‌ ఆమేనా.?

ఖుష్బూ హడావిడి తగ్గింది.. నగ్మా సందడి పెద్దగా కన్పించడంలేదు.. తమిళ రాజకీయాల్లో, తమిళ సినీ రంగంలో ఇప్పుడు ఎక్కడ విన్నా కొత్త 'లేడీ రెబల్‌ స్టార్‌' గురించే చర్చ జరుగుతోంది. సినీ, రాజకీయ వర్గాల్లో అంతలా హాట్‌ టాపిక్‌ అవుతున్న ఆ లేడీ రెబల్‌ స్టార్‌ ఇంకెవరో కాదు, ఒకప్పటి హీరోయిన్‌ కస్తూరి. పలు తెలుగు సినిమాల్లో కూడా కస్తూరి నటించిందండోయ్‌.! 

'అన్నమయ్య', 'మెరుపు', 'సోగ్గాడి పెళ్ళాం', 'మా ఆయన బంగారం' తదితర తెలుగు సినిమాల్లో నటించింది కస్తూరి. రవితేజ హీరోగా వచ్చిన 'డాన్‌' సినిమాలోనూ కస్తూరి కనిపించింది. ప్రస్తుతం, పెద్దగా సినిమాలేమీ చేయట్లేదుగానీ, తమిళ రాజకీయాల గురించి మాట్లాడుతూ, ఇతరత్రా అనేక విషయాలపై సోషల్‌ మీడియాలో స్పందిస్తూ, టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయింది కస్తూరి. 

'రజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశం తమిళనాడుకి అవసరం..' అంటూ మొన్నీమధ్యనే కస్తూరి ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో, ఆమె రజనీకాంత్‌ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జరిగింది. అయితే, రాజకీయాల గురించి తానెలాంటి నిర్ణయం తీసుకోలేదని కస్తూరి క్లారిటీ ఇచ్చిందనుకోండి.. అది వేరే విషయం. ఇక, సినీ పరిశ్రమలో నటీమణులపై లైంగిక వేధింపులు, లైంగిక దాడులపై కస్తూరి గట్టిగానే గళం విప్పి అప్పట్లో అందరి దృష్టినీ ఆకర్షించింది. 

తాజాగా, కమల్‌హాసన్‌ని వెనకేసుకొచ్చిన కస్తూరి, హిందుత్వం పేరుతో ఆందోళనలు చేస్తున్నవారి దృష్టిలో 'విలన్‌'గా మారిపోయింది. 'సెల్ఫ్‌ అపాయింటెడ్‌ కల్చర్‌ వల్చర్స్‌' అంటూ తీవ్రమైన పదజాలంతోనే సోషల్‌ మీడియాలో విరుచుకుపడ్తోంది కస్తూరి. మొత్తమ్మీద, ఇలా తన ఉనికిని గట్టిగానే చాటుకుంటోన్న కస్తూరి, నిజంగానే రాజకీయాల్లోకి వస్తుందా.? వస్తుందో లేదోగానీ, ప్రస్తుతానికైతే లేడీ రెబల్‌ స్టార్‌ అన్న గుర్తింపు అయితే దక్కించేసుకుంది.

Show comments