ఓ సినిమాలో ఓ ప్రత్యేక గీతం.. దాన్ని ఇప్పటిదాకా ఐటమ్ సాంగ్ అనే అంటున్నారంతా. అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్ అనే మాట కూడా విన్పిస్తుంటుంది. పేరేదైతేనేం, అది కూడా నటనలో భాగమే.. అది కూడా డాన్స్‌లో భాగమే.. అనే హీరోయిన్లు చాలామందే వున్నారు. బాలీవుడ్ హీరోయిన్లు ఇందుకు మినహాయింపేమీ కాదు.
'పేరు ఏదైనా పెట్టుకోండి.. ఒకప్పుడు వీటినే వ్యాంప్ పాత్రల్లో కన్పించేవారు చేశారు.. ఇప్పుడు మేం చేస్తున్నాం..' అని ఐటమ్ సాంగ్స్ అలియాస్ స్పెషల్ సాంగ్స్ గురించి హీరోయిన్లు స్పందించడం చూస్తూనే వున్నాం. కానీ, బుల్లితెర బ్యూటీ అనసూయకి కోపమొచ్చింది. 'ఐటమ్' అన్న పదానికి తెలుగు అర్థమేంటో తెలుసా.? అంటూ క్లాస్ పీకింది. ఐటమ్ అంటే వస్తువు.. అంటే, స్త్రీలను వస్తువుల్లా చూస్తారా.? అని మండిపడింది. ఇంతగా ట్రూ ట్రాన్సిలేషన్ చేసేస్తే ఎలా.?
ఓ ప్రముఖ సీనియర్ హీరో ఓ సందర్భంలో, 'ఒకప్పుడు ఎన్టీవోడు అనేవారు.. అంటే అక్కడ ఆయన్ని 'డు' అని సంబోధించినట్లు కాదు.. అది ఆ హీరో మీద అభిమానులకుండే అమితమైన అభిమానం.. మనోడు, ఆడు.. అనే పిలుపులు ఆప్యాయంగా వుంటాయి..' అని చెప్పుకొచ్చారు. ఇప్పుడీ విషయం ఎందుకంటే, సినీ జనాల గురించి ప్రేక్షకులు పిలుచుకునే పిలుపులు విభిన్నంగా వుంటాయి.. వాటిని కెలికితే, వ్యవహారం తేడా కొట్టేస్తుంటుంది. అభిమానం.. అన్న కోణంలో చూస్తే వివాదమే వుండదు.
అయినా, ఐటమ్ సాంగ్స్.. అని ఇప్పుడు కొత్తగా ఎవరూ పిలవడంలేదు.. ఎప్పటినుంచో వున్నదే. అనసూయ కొత్తగా ఐటమ్ సాంగ్స్.. అదేనండీ స్పెషల్ సాంగ్స్ చేస్తోందంతే. అందుకే, ఆమెకు అసలు విషయం అర్థం కాలేదు. ఇలా చిన్న విషయాలకే కసురుకుంటే కష్టమేనన్నది మెజార్టీ అభిప్రాయం.