పరిటాల సునీత, శ్రీరామ్‌ .. వాట్‌ నెక్ట్స్‌?

గత వారంలో తెలుగుదేశం అధినేత అనంతపురం జిల్లా నేతలకు గట్టి కౌన్సిలింగే ఇచ్చాడు. మూడు రచ్చలు ఆరు గొడవలు అన్నట్టుగా సాగుతున్న పార్టీని గాడిన పెట్టడానికి ఆయన శతథా యత్నించాడు. పార్టీలో గొడవ ఒకటి కాదు.. ఒక నియోజకవర్గంలో ఒక్కోగొడవ. పార్టీలో దశాబ్దాలుగా పనిచేస్తున్న వారి మధ్య కూడా విబేధాలు పతాక స్థాయికి చేరాయి. ఒకరి నియోజకవర్గంలో మరొకరు వేలెడుతున్నారు. ఒకరికి మరొకరు చెక్‌ చెప్పుకునే పనిలో బిజీగా గడిపేస్తున్నారు.

తెలుగుదేశం విబేధాలు రచ్చకు ఎక్కి చాలా కాలం అయ్యింది. పక్క నియోజకవర్గం మాదే.. అనే నేతలు ఎక్కువయ్యారు. ఇలాంటి వారిలో మంత్రి హోదాలో ఉన్న పరిటాల సునీత కూడా ఒకరు. ఈమె రాప్తాడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ఎదిగొచ్చిన కొడుకు రాజకీయ భవిష్యత్తుకు కూడా ఈమె ప్రణాళికలు రచిస్తోంది. తాము ఒక నియోజకవర్గానికి పరిమితం అయితే చాలదు.. పరిధిని పెంచుకోవాలనేది సునీత భావన. దీని కోసమని.. సునీత ధర్మవరం నియోజకవర్గం మీద దష్టి సారించింది. అది తమ నియోజకవర్గం అని ఆమె వివిధ ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది.

ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోట అయిన ధర్మవరంలో తెలుగుదేశం విత్తనమేసింది తన భర్తే అని సునీత అంటారు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఎవరెవరో వచ్చి.. తెలుగుదేశం నేతలుగా చలామణి అవుతున్నారని.. ఆమె ఆవేధన వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో.. ధర్మవరం క్షేత్ర స్థాయిలో.. పరిటాల వర్గీయులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయులు అమితుమి తేల్చుకుంటున్నారు. పలుదఫాలుగా తన్నుకున్నారు. ఈ విధంగా తెలుగుదేశం విబేధాలు రచ్చకు ఎక్కాయి.

ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు పార్టీ నేతలకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఎవరెవరి మధ్య విబేధాలున్నాయో వారిని కూర్చోబెట్టుకుని మాట్లాడారు. ఇందులో భాగంగా సునీతకు బాబు చాలా స్పష్టంగానే చెప్పాడట, ధర్మవరం వ్యవహారాల్లో వేలుపెట్టొద్దు అని! మీ నియోజవర్గానికి మీరు పరిమితం కండి.. అని సునీతకు బాబు స్పష్టం చేసినట్టు సమాచారం. ఒకవైపు సునీత ఏమో.. అది మాది, అని అంటుంటే.. బాబు మాత్రం ఆ వాదనను ఒప్పుకోవడం లేదు.

దీంతో ధర్మవరంపై ఆధిపత్యం కోసం పరిటాల వర్గం చేసిన యత్నాలు విఫలం అయినట్టే. ఆ నియోజకవర్గం తెలుగుదేశం బాధ్యతలను వరదాపురం నుంచి తప్పించాలనే యత్నాలకు బ్రేక్‌పడింది. మరి ఇప్పుడు సునీత, శ్రీరామ్‌లు ఏం చేస్తారో చూడాలి! బాబు హెచ్చరికల నేపథ్యంలో వీళ్లు రాప్తాడుకే పరిమితం అయిపోతారా? అంతగా ఆక్రోశించి.. ఇప్పుడు వెనక్కు తగ్గితే అది వీరి స్థాయికి అవమానం కాదా? లేక బాబు మాటలను ఖాతరు చేయక.. ధర్మవరం తమదే.. అనే ధోరణితో ముందుకు సాగుతారా? 

Show comments