బాబు.. ఈ విషయంలో దేశంలోనే నంబర్ వన్!

అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రీఫామ్స్.. సంక్షిప్తంగా ఏడీఆర్. ఇప్పుడు ఈ సంస్థ దేశంలో రాజకీయ పార్టీలను ఇరకాటంలో పడేస్తోంది. ప్రత్యేకించి అధికారంలో ఉన్న వారి గురించి ఈ సంస్థ ఇస్తున్న నివేదికలు హాట్ టాపిక్స్ గా మారాయి. వివిధ రకాల అధ్యయనాల ద్వారా రాజకీయ నేతల ఆస్తుల గురించి ఈ సంస్థ చెబుతున్న గణాంకాలతో ఆయా పార్టీలు ఇబ్బందులు పడుతున్నాయి. రాజకీయ నేతల ఆస్తులు, వారి అవినీతి గురించి ఈ సంస్థ చెబుతున్న గణాంకాలు విస్మయాన్ని గొలిపేలా ఉన్నాయి!

దేశంలోని అన్ని రాష్ట్రాల రాజకీయ పరిస్థితుల మీదా ఆ సంస్థ అధ్యయనాలతో ఈ సంస్థ నేతల గుండెళ్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఏపీ మంత్రులు దేశంలోనే అత్యంత ధనికులు అని తేల్చినా.. కర్ణాటక రాష్ట్ర మంత్రి వర్గంలో 98 శాతం మంది అవినీతి పరులే అని కుండబద్దలు కొట్టినా ఆ సంస్థ కే సాధ్యం అవుతోంది. ఏపీ మంత్రి నారాయణను దేశంలోనే అత్యంత ధనికుడైన మంత్రి అని తేల్చింది కూడా ఈ సంస్థే.

ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సంస్థ సీఎంల ఆస్తుల వివరాల గురించి నివేదిక ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి.  ఇది ఏపీ ప్రజలకు చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే.. ఏపీ సీఎం చంద్రబాబును దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఏడీఆర్ నివేదిక ప్రకారం బాబు ఆస్తులు మొత్తం రూ.176 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది!

ఈ నంబర్ తో దేశంలోనే అత్యంత ఆస్తిపరుడైన ముఖ్యమంత్రిగా బాబు రికార్డు సృష్టించినట్టు అయ్యిందని ఈ సంస్థ పేర్కొంది. విశేషం ఏమిటంటే.. వ్యక్తిగత ఆస్తుల విషయంలో, తన వైభవంతో ప్రపంచాన్నే అబ్బుర పరిచిన తమిళనాడు సీఎం జయలలిత కూడా బాబు కన్నా చాలా వెనుకబడి ఉండటం! ముఖ్యమంత్రిగా అవినీతి చేసిందనే ఆరోపణలతో జైలు వరకూ వెళ్లి వచ్చిన జయలలిత ఆస్తుల గురించి, ఆమె వైభవం గురించి మీడియాలో ఎంత ప్రచారం జరిగిందో వేరే వివరించనక్కర్లేదు. అయినప్పటికీ ఆస్తుల విషయంలో ఆమె బాబుకు పోటీకి రాలేకపోయింది.  Readmore!

బాబు తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఆస్తుల విలువ వంద కోట్ల పైనే ఉంది. జయలలిత ఆస్తులు రూ.110 కోట్ల రూపాయల పైనే అని ఈ సంస్థ తేల్చింది! 

ఇటీవలి కాలంలో ఏపీ వివిధ అంశాల్లో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. అందులో ముఖ్యమైనది అవినీతి. ఒక విశ్వసనీయ అధ్యయన సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం.. పెట్టుబడులకు ఏపీ ఏ మాత్రం అనుకూల స్థానం కాదని, ఇక్కడ అవినీతి పెచ్చుమీరిందని తేలింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత అవినీతి ఏపీలోనే ఉందని.. తమిళనాడు కూడా ఈ విషయంలో సైడైపోయి.. ఏపీకే తొలి స్థానం ఇచ్చిందని  ఆ నివేదిక లో పేర్కొన్నారు. మరి ఇప్పుడు ఆస్తుల విషయంలో ఏపీ సీఎంకు నంబర్ వన్ పొజిషన్ ఇచ్చింది మరో సంస్థ.

మరి ఈ లెక్కలు చెబుతున్న వేళ బాబు గారు తన ఆస్తుల గురించి చేసే ప్రకటనలనూ గుర్తు చేయాలి. దేశంలో తనంతటి నీతి మంతుడు ఎవరూ లేరని. అందుకే ప్రతి ఏడాదీ ఆస్తుల ప్రకటన చేస్తానని ఆయన చెబుతూ ఉంటారు. చివరి సారి ఆయన తన ఆస్తుల విలువను ప్రకటించినప్పుడు రూ.42 లక్షలు అనే నంబర్ వినిపించింది! తను కడు పేదవాడిని అని బాబు చెప్పుకొంటే.. బయటి వాళ్లేమో రూ.176 కోట్లతో ఆయన దేశంలోనే నంబర్ వన్ అంటున్నారు. ఇదీ కథ.  

Show comments

Related Stories :