రకుల్‌: అలా చూడని రోజెప్పుడొస్తుందో.!

'మహిళని వస్తువుగా చూడని రోజెప్పుడొస్తుందో.. అలాంటి రోజొకటి వస్తుందని ఆశిస్తున్నాను..' అంటూ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోషల్‌ మీడియాలో ఓ మాంఛి పోస్ట్‌ని, అంతే పవర్‌ఫుల్‌ మెసేజ్‌తో కూడిన ఓ ఫొటోతో సహా పోస్ట్‌ చేసింది. ఇకనేం, క్షణాల్లో ఈ రకుల్‌ 'పోస్టింగ్‌' సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిపోయింది. 

బెంగళూరులో డిసెంబర్‌ 31 అర్థరాత్రి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకలు నిర్వహించుకున్న వేళ, మహిళలపై కొందరు ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తించడం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం విదితమే. ఈ వ్యవహారంపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాప్సీ ఈ విషయంలో అందరికన్నా ముందుంది. మార్పు ఇంటి నుంచే రావాలని, అబ్బాయిల ప్రవర్తన ఇంట్లోని అలవాట్లను బట్టి, అలాగే సమాజాన్ని బట్టి మారుతోందని తాప్సీ వ్యాఖ్యానించింది. 

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ అయితే, వేధింపుల నుంచి తప్పించుకోడానికి మానసికంగా, శారీరకంగా మహిళలు బలంగా వుండాలనీ, కరాటే - కుంగ్‌ఫూ వంటి పోరాట విద్యల్లో మెళకువలు నేర్చుకోవాలని అక్షయ్‌కుమార్‌ సూచిస్తూనే, పురుషులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చాడు. 

ఇదిలా వుంటే, అటు బాలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ 'పోస్టింగ్‌' హాట్‌ టాపిక్‌ అయ్యింది. అభిమానులు తమ అభిమానాన్ని చాటుకునేందుకు చేతులు కోసుకోవడం, పచ్చబొట్టు పొడిపించుకోవడం వంటివి చేయరాదంటూ మొన్నీమధ్యనే మరో హీరోయిన్‌ సీరత్‌కపూర్‌కి ఎదురైన చేదు అనుభవంపై స్పందించిన రకుల్‌, ఇప్పుడిలా మహిళలపై వేధింపులపై స్పందించి తన ప్రత్యేకతను చాటుకుంది.

Show comments