రవితేజ... ప్రపంచ టూర్లో ఉన్నాడా..!

‘బెంగాల్ టైగర్’ తర్వాత రవితేజ తర్వాతి సినిమా ఏమిటనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. కొన్నేళ్లుగా అంత ఫామ్ లో లేని ఈ హీరో ఈ విధంగా లాంగ్ గ్యాప్ నే తీసుకున్నాడు. రవితేజ హీరోగా కొన్ని సినిమాలు ప్రతిపాదనలు రావడం, ప్రారంభం అయ్యిందనుకున్న ఒక సినిమా అంతటితో ఆగిపోవడం జరిగింది. ఇక ఈ హీరో తన తర్వాతి సినిమాను ఎప్పుడు ప్రారంభిస్తాడు.. ఎవరితో ప్రారంభిస్తాడు.. అనే అంశాలకు సమాధానాలు లేవు.

ఈ నేపథ్యంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. ప్రస్తుతం రవితేజ ప్రపంచ టూర్లో ఉన్నాడట. సినిమాల నుంచి లభించిన ఈ విరామంలో ప్రపంచాన్ని చుట్టేస్తున్నాడట! మంచి పనే.. అందరికీ రాదు కదా.. ఇలాంటి అవకాశం.

మరి సినిమాల మాటేంటి అని పూరీనే అడిగితే… మీరిద్దరూ కలిసి చేస్తారా? అంటే.. అదేం లేదు, సినిమాలు మానేసి తనను కూడా విహారానికి రమ్మని  రవితేజ అన్నాడని పూరీ జగన్నాథ్ చెప్పాడు. మొత్తానికి రవితేజ సినిమాల టెన్షన్ నుంచి విరామం తీసుకుని.. తనివితీరా ప్రపంచాన్ని చుట్టేస్తున్నాడనమాట.

Show comments