సన్మానాల ‘యావ’ ఏంటి చంద్రబాబూ.?

ఏంటో, ఒక్కోసారి చంద్రబాబు తనను తాను మర్చిపోతుంటారు. తన గురించి తాను పొగుడుకునేటప్పుడు చంద్రబాబుని, ఆపడం ఎవరితరమూ కాదు. ఆయన్ని 'ఏదో' పూనేస్తుంటుంది. ఆ 'ఏదో' అంటే, ఏదో కాదు, అతని అహంభావం మాత్రమే.! 

మామూలుగా అయితే, ఫలానా వ్యక్తి చాలా చాలా చాలా కష్టపడుతున్నాడో, చాలా చాలా చాలా గొప్పవాడనో ఆ వ్యక్తి గురించి ఇంకెవరో చెప్పాల్సి వుంటుంది. కానీ, చంద్రబాబు అలా కాదు, తన గురించి తానే గొప్పగా చెప్పేసుకుంటుంటారు. అవును మరి, ఎవరూ తనను అభినందించనప్పుడు.. ఎవరూ తన గొప్పతనాన్ని గుర్తించనప్పుడు.. తన గురించి తానే చెప్పుకోవాలి కదా.! అదే, ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది. 

ప్రపంచమంతా నేడు 'కార్మిక దినోత్సవం' జరుపుకుంటోంది. ఆయా రంగాల్లో తమదైన ప్రత్యేకతను చాటుకున్న కార్మికులకు, కార్మిక సంఘాల నేతలకు సన్మానం జరగడం సహజమే. మామూలుగా అయితే పాలకులో, ఆయా సంస్థలో, కార్మిక సంఘాలో.. ఈ సన్మాన కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతుంది. కానీ, చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో.. తమ ప్రభుత్వం తరఫున, కార్మికులంతా తననే సన్మానించాలని కోరుకుంటున్నారు. నవ్విపోదురుగాక మనకేటి.? అన్న చందాన తయారయ్యింది వ్యవహారం కదూ.! 

'నేనే అందరికన్నా పెద్ద కార్మికుడ్ని.. రాష్ట్ర అభివృద్ధి కోసం రేయింబవళ్ళు కష్టించి పనిచేస్తున్నాను.. సన్మానం అంటూ జరిగితే, అది మీరు నాకే చేయాలి..' అంటూ కార్మికుల్ని ఉద్దేశించి కార్మిక దినోత్సవం రోజున చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో యావత్‌ కార్మిక లోకం షాక్‌కి గురయ్యింది. సన్మానాలు కావాలంటే, చంద్రబాబు పార్టీ వేదికలపై చేయించుకోవచ్చు. ముఖ్యమంత్రి గనుక, పూటకో సన్మాన కార్యక్రమాన్ని మొత్తం 13 జిల్లాల్లో ఎక్కడో ఓ చోట ప్లాన్‌ చేసుకోవచ్చు. 

కార్మిక దినోత్సవం రోజున, కార్మికులకు తమ ప్రభుత్వం తరఫున ఏమేం గొప్ప పనులు చేస్తామో చెప్పాల్సిన చంద్రబాబు, కార్మిక లోకం తనను సన్మానించాలని కోరడమేంటో.!

Show comments