సినీ ఇండస్ట్రీ అమరావతికి.. ఈ అంశంపై ఆసక్తికరమైన లాజిక్ తో కూడిన కామెంట్ ను చేశాడు నటుడు సుమన్. విభజనతో రెండుగా మారిన తెలుగు రాష్ట్రాల మధ్య.. టాలీవుడ్ ఎంపిక ఏది? అంటే.. హైదరాబాదే అనేశాడు సుమన్. మరి సినీ ఇండస్ట్రీలో వ్యక్తులంతా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సినీ ఇండస్ట్రీని అమరావతికి రారమ్మంటున్నాడు.. కదా.. అంటే, అయినా కూడా ఇండస్ట్రీ అమరావతి వైపు తరలే అవకాశం లేదని సుమన్ అభిప్రాయపడ్డాడు. చెన్నై నుంచి హైదరాబాద్ కు తరలివచ్చింది కదా… మరి హైదరాబాద్ నుంచి అమరావతి వైపు వెళ్లదా? అంటే.. ఆ అవకాశం లేదని సుమన్ అన్నాడు.
ఎందుకలా? అంటే.. భూముల ధరలను ప్రస్తావించాడీయన. చెన్నై నుంచి హైదరాబాద్ కు తెలుగు చిత్ర పరిశ్రమ తరలి రావడంలో స్టూడియోలు ముఖ్య పాత్ర పోషించాయని, అలాంటి స్టూడియోలు నిర్మించుకోవడానికి హైదరాబాద్ లో భూముల ధరలు సరసమైన ధరల్లో అందుబాటులో ఉండేవని.. దీంతోనే చెన్నై నుంచి హైదరాబాద్ కు చిత్ర పరిశ్రమ తరలి రావడం సులభతరమైందని సుమన్ అభిప్రాయపడ్డాడు.
అయితే ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో భూముల ధరలను చూస్తుంటే.. అక్కడ స్టూడియోలు నిర్మించడం అనేది సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదని సుమన్ పేర్కొన్నాడు. ఈ ప్రకారం చూస్తే.. హైదరాబాద్ లో హ్యాపీగా ఉన్న చిత్ర పరిశ్రమ అమరావతి కి ఎందుకు వెళుతుందన్నట్టుగా సుమన్ మాట్లాడాడు.
మరి ఈ లాజిక్ అయితే కాదనలేని అంశమే. ఇప్పటికే ఏపీ విషయంలో సినీ పరిశ్రమ దృక్పథం ఏమిటో కూడా పరిపరి విధాలుగా వ్యక్తం అవుతూ వస్తోంది. మరి ఇప్పుడు కూడా పరిశ్రమ ఏపీ వైపు తరలి వెళ్లాలంటే.. అమరావతిలో ఇండస్ట్రీ ఉనికి కనిపించాలంటే.. అందుకే మార్గం ఒకటే, ప్రభుత్వం తక్కువ ధరలకే సినిమా వాళ్లకు ఇచ్చి స్టూడియోలు నిర్మించాలనే ప్రతిపాదనలు పెట్టడం. సింగపూర్ వాళ్లు దానికి ఒప్పుకుంటారా? అనేది ఒక సందేహం. అయితే.. కనీసం తెలుగుదేశం పార్టీకి వీర విధేయులు అయినా.. సినిమా వ్యక్తులైనా అమరావతిలో సరసమైన ధరల్లో భూములు తీసుకుని స్టూడియోలు నిర్మించి బాబుగారి కలల నగరానికి సినీ కళ తీసుకొస్తారేమో చూడాలి!