భాజపాపై బాబు పెత్తనం సాగుతుందా? ఆగుతుందా?

'2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్థాయి పార్టీగా ఎదుగుతాం' అనే నినాదం నుంచి 'ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ శూన్యతను భర్తీచేసి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎదుగుతాం' అనే వరకు తడవతడవకూ రకరకాలుగా ఏపీ భాజపా నాయకులు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఏపీలో పార్టీని విస్తరింప జేయడం గురించి ఇప్పటిదాకా నిర్దిష్టంగా వారు ఏ చిన్న పని కూడా చేసిన దాఖలాలు మాత్రం మనకు కనిపించవు. అన్ని రాష్ట్రాలకు పూర్తయినా కనీసం ఏపీ భాజపా సారధిని నియమించడానికి కూడా వారు కొన్ని నెలలుగా నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మళ్లీ కొన్ని రోజుల వ్యవధిలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడి నియామకం జరుగుతుందనే ప్రచారం మొదలైంది. 

ఈ నేపథ్యంలో.. అసలు మూల కారణాలు అన్నీ చర్చకు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడి విషయంలో నిర్ణయం తీసుకోకుండా సాగతీత ధోరణికి పరోక్షంగా చంద్రబాబునాయుడే కారణం అనే ప్రచారం కూడా ఉంది. కేంద్రంలో తన పలుకుబడి అంటూ ఏమీ లేకపోయినా, వెంకయ్యనాయుడితో ఉన్న 'మైత్రి' కారణంగా.. రాష్ట్ర భాజపా ఎలా నడవాలనేది ఇన్నాళ్లూ చంద్రబాబునాయుడే డిసైడ్‌ చేస్తూ వచ్చారు. పార్టీ కూడా ఆయనకు సహకరిస్తూ ఉన్నదనే విమర్శలూ ఉన్నాయి. చంద్రబాబు సర్కారు పాలనలో ఉన్న లోపాలను ప్రశ్నించే దూకుడు తత్వం ఉన్న సోము వీర్రాజు, పురందేశ్వరి వంటి భాజపా నాయకులకు ఎలాంటి ప్రాధాన్యం వీలైనంత దాకా అధ్యక్ష పగ్గాలు దక్కకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నాడనే ఆరోపణలు కూడా అనేకం వినిపించాయి. 

ప్రస్తుత భాజపా సారధి కంభంపాటి హరిబాబు , తెదేపా సర్కారు పట్ల మెతగ్గా వ్యవహరిస్తున్నారనేది ఆరోపణ. అదే సమయంలో చంద్రబాబును దుమ్మెత్తిపోసే , దూకుడుగా మాట్లాడే భాజపా నాయకులకు ఆ పార్టీలో ప్రాధాన్యం దక్కకుండా చంద్రబాబు చక్రం తిప్పుతున్నాడనేది పుకారు. అధ్యక్ష పీఠం మళ్లీ కంభంపాటి చేతుల్లోనే పెట్టేలా చూడాలనేది చంద్రబాబు స్కెచ్‌ అని కూడా ఒక చర్చ ఉంది. అదే జరిగితే.. చంద్రబాబుకూ చాలా సేఫ్‌ గేం అవుతుంది. తాను తన నిర్ణయాల విషయంలో ఎలా చెలరేగినా.. భాజపానుంచి కనీసం ప్రశ్నించే, విమర్శించే దిక్కుండదని ఆయనకు ఓ ధీమా ఏర్పడే ఛాన్సుంటుంది. మరొకరైతే.. ఆయన ఆటలు ఇచ్చమొచ్చినట్లుగా సాగకపోవచ్చు. 

ఇలాంటి నేపథ్యంలోనే అసలు కీలక ఘట్టం ఇప్పుడు వచ్చింది. కొత్త అధ్యక్ష నియామకానికి రంగం సిద్ధమైంది. శుక్రవారం అమిత్‌షా ఏపీ భాజపా సమావేశం నేపథ్యంలో కొత్త అధ్యక్ష ప్రకటన ఉంటుందని అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు పెత్తనం ఇంకా భాజపా మీద సాగుతుందా? ఆగుతుందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. చంద్రబాబు పేరుకు ఎన్డీయే లో భాగస్వామిగా.. వారిని పట్టుకుని ఊగులాడుతున్నాడే తప్ప.. ఆయన అస్తిత్వానికి మోడీ సర్కార్‌, భాజపా కేంద్ర నాయకత్వం విలువ ఇవ్వడం మానేసినిట్లు ఇటీవలి పరిణామాలు.. ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్న కేటాయింపులు స్పష్టం చేస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో ఏపీలో పార్టీ విస్తరణ లక్ష్యంగా.. సోము వీర్రాజు లాంటి 'యాంటీ చంద్రబాబు' నాయకుడికే కట్టబెడతారని ఊహాగానాలు నడుస్తున్నాయి. మోడీ వద్ద చంద్రబాబు విలువ పడిపోయినట్లు గుర్తిస్తేగనుక.. ఈదఫా వెంకయ్య కూడా మౌనం దాలుస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. భాజపా వ్యవహారాల్లో చక్రం తిప్పడంలో చంద్రబాబు హవా ఏ మేరకు ఉన్నదో రెండు రోజుల్లో తేలుతుంది.

Show comments