తన జీవితంలో ప్రేమకిక చోటు లేదని తేల్చేసింది బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. 'ఏక్ నిరంజన్' సినిమాతో వెండితెరకు పరిచయమైన కంగనా రనౌత్, సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ రంగంలో వున్నప్పుడే బీభత్సమైన ఎఫైర్స్ నడిపేసింది. సినిమాల్లోకి వచ్చాకా ఆ ఎఫైర్లను కొనసాగించింది. ఎవరూ ఊహించని విధంగా ఎఫైర్స్‌కి ఫుల్ స్టాప్ పెట్టేసి, పూర్తిగా నటన మీదే దృష్టి పెట్టడం ద్వారా బాలీవుడ్‌లో వరుస విజయాల్ని అందుకుంది కంగనా రనౌత్.
ఒకప్పుడు ప్రేమ సాగరంలో ఎడా పెడా ఈదేసిన కంగనా, ఇప్పుడు ప్రేమంటేనే నాన్సెన్స్ అంటూ తెగేసి చెబుతోంది. అసలు ప్రేమ జోలికి భవిష్యత్తులో వెళ్ళే అవకాశం లేదని అంటోంది. ఇంతలా ప్రేమ మీద వైరాగ్యం ఎందుకొచ్చింది.? అనడిగితే, 'ఎక్కువమందిని ప్రేమించేయడం వల్లనేనేమో..' అంటూ తన మీద తానే సెటైర్ వేసేసుకుంది కంగనా రనౌత్.
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా యువతకి కంగనా ఓ మంచి మెసేజ్ కూడా ఇచ్చిందండోయ్. భౌతిక ఆకర్షణనే చాలామంది ప్రేమ అనుకుంటారనీ, తాను కూడా అలాగే అనుకుని మోసపోయాననీ, ప్రేమించడానికి మానసికంగా మెచ్యూరిటీ ఎంతో అవసరమనీ, ఆ మెచ్యూరిటీ వున్నప్పుడే సరైన వ్యక్తిని ప్రేమించగలుగుతామని కంగనా రనౌత్ 'లవ్ లెక్చర్' తీసుకుంది.
పైకి, కంగనా ప్రేమ మీద ఇంత వైరాగ్యం ప్రదర్శిస్తున్నా, ఎప్పటికప్పుడు ఆమె పేరు 'ఎఫైర్ గాసిప్స్' కాలమ్‌లో టాప్ లిస్ట్‌లోనే వుంటుంది. ఎందుకిలా.? ఏమో మరి, ఆమెకే తెలియాలి.