తమిళనాట.. బీజేపీ వ్యూహాలు ఇంత కామెడీగానా!

తమిళనాడు పరిణామాలను ఎలా డీల్ చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నట్టుగా ఉంది భారతీయ జనతా పార్టీ. స్వయంగా అమిత్ షా జోక్యం చేసుకుని కూడా ఈ వ్యవహారాన్నిఎటూ తేల్చలేకపోతున్నాడు. వ్యూహాత్మకంగా పన్నీరు సెల్వం, పళనిసామిలను ఏకం చేయాలనేది అమిత్ షా లెక్క. వారిపై శశికళ భారాన్ని తగ్గించడంతో పాటు, కేంద్రం నుంచి పూర్తి సహకారం ఇస్తూ.. వారిద్దరిపై బీజేపీ ని సవారీ చేయించేలా.. అమిత్ షా గేమ్ మొదలుపెట్టారు. అయితే ఈ వ్యవహారంపై మొదట్లో తలూపినట్టుగానే కనిపించిన పన్నీరు, పళనిలు ఇప్పుడు మాత్రం వ్యక్తిగతంగా తమ లబ్ధిలనే పరమావధిగా చూసుకుంటున్నారని తెలుస్తోంది.

ముఖ్యమంత్రి పదవి, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి.. వీటి విషయంలో పన్నీరు, పళనిలు పోటీలు పడుతున్నారు. కాసేపు ముఖ్యమంత్రి పదవి కావాలంటే మరి కాసేపటికి ప్రధాన కార్యదర్శిపదవి కావాలని అంటున్నారు. అంతిమంగా రెండూ ఒకరికే అయితే బావుంటుందన్నట్టుగా వీరిద్దరూ రచ్చ చేస్తున్నారు. చెరొకటి.. అయితే వ్యవహారం పరిష్కారం అవుతుంది. అయితే ఇద్దరూ కూడా రెండూ తమకే కావాలంటున్న నేపథ్యంలో… ఈ వ్యవహారాన్ని పరిష్కరించడం అమిత్ షా కు కూడా సాధ్యం అయ్యే లా లేదు.

ఇద్దరినీ పిలిపించుకుని మాట్లాడదాం.. అంటే, అది కుదిరేలా లేదు. ఆశలావు పీక సన్నం.. అన్నట్టుగా ఉంది కమలం పార్టీ పరిస్థితి. తమిళనాడులో బలపడాలి.. ఇప్పుడే అక్కడ ఎన్నికలు రాకూడదు.. ఎన్నికలంటూ వస్తే.. డీఎంకే కేకలేసి విజయం సాధిస్తుంది. అది జరగకూడదు. శశికళ తమ మాట వినదు కాబట్టి.. అన్నాడీఎంకే పై ఆమె పట్టు ఉండకూడదు. పన్నీరు, పళనిలకు వెన్నెముక లేదు కాబట్టి.. వీళ్లను పెట్టి కథ నడిపించాలి. వాళ్లు చూస్తే.. దండుకోవడానికి ఉన్న  అవకాశాలను చూసుకొంటున్నారు. అవకాశం ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు.. ఉన్నంతలో  సాంతం నాకేయాలి.. అందుకోసం పోరాడుతున్నారు. వాళ్ల తోకలు పట్టుకుని తమిళనాడును ఈదాలని బీజేపీ ప్రయత్నిస్తోంది!

వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని బరిలో దిగాలి.. భారీ సంఖ్యలో అభ్యర్థులను బరిలో నిలపాలని బీజేపీ కలలు కంటోంది. అందుకోసమే.. పళనీ, పన్నీరులను నమ్ముకుంది. మరి అసలు అన్నాడీఎంకే జయలలిత ఆసుపత్రి పాలైన నాడే గతించింది.. ఇప్పుడున్న అన్నాడీఎంకేతో కలిసి బరిలో దిగడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ప్రహసనం మాత్రమే!

Show comments