ఆలస్యంగానైనా దాసరికి దక్కుతోంది

తెలుగు సినీ పరిశ్రమకు 'పెద్ద దిక్కు' అన్న గుర్తింపు అయితే దర్శకరత్న దాసరి నారాయణరావు దక్కించుకున్నారుగానీ, ఆయన మరణించాక ఆయన్ని పెద్ద దిక్కుగా తెలుగు సినీ పరిశ్రమ నిజంగానే భావించిందా.? అన్న అనుమానం కలిగేలా సినీ పరిశ్రమలో వాతావరణం కన్పించింది. 'ప్రముఖులు'గా చెప్పుకోబడే చాలామంది, దాసరి మరణానంతరం కన్పించలేదు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి సైతం దాసరి సంతాప సభలు నిర్వహించలేదన్న విమర్శలు విన్పించాయి. 

ఎట్టకేలకు సినీ పరిశ్రమలోని అన్ని విభాగాలూ కలిసికట్టుగా నిన్న ఓ భారీ సంతాప సభను నిర్వహించేశాయి. తాజాగా ఈ రోజు దశదిన కర్మ సందర్భంగానూ పలువురు సినీ ప్రముఖులు కన్పించారు. మరికొందరు, విదేశాల్లో వుండి రాలేకపోయిన కారణంగా, అక్కడే నివాళులర్పించేసి, వాటి తాలూకు వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో పెట్టి 'మమ' అన్పించేసుకున్నారు. 

దాసరి నిజంగా అభిమానించే సినీ పరిశ్రమలోని కొందరు వ్యక్తులు ఈ పరిస్థితిని చూసి ఆశ్చర్యపోతూనే, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'పోన్లే.. ఇలాగైనా దాసరికి కాస్తంత గౌరవం దక్కింది..' అనుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దాసరికి సినీ పరిశ్రమకు చెందిన అన్ని విభాగాలకు చెందిన యూనియన్లతోనూ అత్యంత సాన్నిహిత్యం వుంది. దాదాపు అన్ని యూనియన్లకూ ఆయనే పెద్ద దిక్కుగా వ్యవహరించారు. అలాంటిది, దాసరిని ఇంత తేలిగ్గా ఎలా అంతా లైట్‌ తీసుకున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.

Show comments