పేదల ప్రభుత్వం...మంత్రులు కోటీశ్వరులు...!

దేశానికి స్వాతంత్య్రం వస్తే సామాన్యులు సైతం ఎన్నికల్లో పాల్గొనవచ్చని, ప్రజాసేవ చేయవచ్చని స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న నాయకులు భావించారు. మన రాజ్యాంగ నిర్మాతలూ అలాగే అనుకున్నారు. అట్టడుగు వర్గాలవారు కూడా ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతోనే పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్నింటిని రిజర్వుడుగా ప్రకటించారు. ఏం చేసినా, ఎంత చేసినా కాలక్రమంలో రాజకీయ నాయకుల్లో రెండే వర్గాలు మిగిలాయి. ఒకరు సంపన్నులు, మరొకరు నేరగాళ్లు. సామాన్యులు ఎన్నికల్లో గెలిచి అధికారంలో పాలుపంచుకుంటున్నారేమోగాని వారి శాతం చాలా తక్కువ. 

రిజర్వుడు నియోజకవర్గాల్లోనూ డబ్బున్నవారికే పార్టీలు టిక్కెట్లు ఇస్తున్నాయి తప్ప సామాన్యులను పట్టించుకోవడంలేదు. 'డబ్బున్నవారికే టిక్కెట్లు' అని పార్టీల అధినేతలు బహిరంగంగానే చెబుతున్నారు. సంపన్నులే ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తున్నారు కాబట్టి సహజంగానే వారే మంత్రులవుతున్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఇలాంటి రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్‌ కూడా ఒకటి. మమతా బెనర్జీ తనది పేదల ప్రభుత్వమని, పేదల పార్టీ అని చెప్పుకుంటారు. 'తృణమూల్‌ కాంగ్రెస్‌' అంటేనే అట్టడుగు వర్గాలకు చెందిన పార్టీ అని, కార్యకర్తల పార్టీ అని అర్థం. పేరు అలా పెట్టుకున్నంత మాత్రాన ఆచరణ కూడా అలాగే ఉండలనే రూలేం లేదు కదా. ఉంటే అధికారం దక్కదు.

పేదల ప్రభుత్వమని చెప్పుకునే మమతా బెనర్జీ సర్కారులోని మంత్రుల్లో సగం మందికి పైగా  కోటీశ్వరులు.  మమతది నిరాడంబర జీవితమే కావొచ్చు. ఆమె సాదాసీదా కాటన్‌ వస్త్రాలు ధరించి, కాళ్లకు స్లిప్పర్లు వేసుకొని సాధారణ మహిళలా రోడ్డు మీద నడిచిపోవచ్చు. విపక్షంలో ఉన్నప్పుడు పేదల పక్షాన పోరాటాలు చేసుండొచ్చు. కాని పార్టీ మనుగడ సాగించాలంటే, అధికారంలోకి రావాలంటే, ప్రభుత్వం స్థిరంగా ఉండాలంటే సంపన్నుల అండ ఉంటేనే సాధ్యం. ఇది ఒక్క మమతకే వర్తించదు. అన్ని పార్టీలదీ ఇదే దారి. దీదీ మంత్రివర్గంలోని 42 మంది మంత్రుల్లో సగానికి పైబడి మల్టీ మిలియనీర్లు. వీరి సగటు సంపద 3.3 కోట్లు. మొత్తం మంత్రుల్లో 24 మంది (57 శాతం) కోటీశ్వరులు. 

కార్మిక శాఖ మంత్ర జకీర్‌ హుస్సేన్‌ 28 కోట్ల ఆస్తితో అగ్రస్థానంలో ఉన్నారు. విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి జావేద్‌ ఖాన్‌ ఆస్తి 17 కోట్లు. ఆర్థిక శాఖ మంత్రి అమిత్‌ మిత్రా సంపద 11 కోట్లు. వీరు ముగ్గురు మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లక్షాధికారేగాని కోటీశ్వరురాలు కాదు.  అయితే 2011తో పోలిస్తే ఆమె చరాస్తులు 2016 ఎన్నికల నాటికి రెట్టింపయ్యాయి. ఎన్నికల అఫిడవిట్‌లో ఆమె ఈ విషయం తెలియచేశారు. 2011లో ఆమె చరాస్తుల విలువ రూ.15,84,169. 2016 నాటికి అది 30,45,000 అయింది. ఆమె  స్థిరాస్తుల వివరాలు తెలియరాలేదు.  Readmore!

కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో, కేంద్ర ప్రభుత్వంలో వందల కోట్ల ఆస్తులున్నవారున్నారు.  ఒకానొక కాలంలో ప్రజాసేవ చేయాలనే కాంక్ష, దృక్పథం ఉన్నవారే రాజకీయాల్లో ఎక్కువగా ఉండేవారు. కాని ఇప్పుడు అలాంటివారు చాలా తక్కువ. ఆస్తులు సంపాదించుకోవడానికి, ఉన్న ఆస్తులను, వ్యాపారాలను కాపాడుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యా సంస్థల, మీడియా సంస్థల అధిపతులు కూడా  రాజకీయల్లోకొచ్చి ఎన్నికల్లో పోటీ చేయడం ఎక్కువైంది. 

ఎన్నికల్లో గెలుపే పరమార్థమనుకుంటున్న , అధికారంలోకి రావడమే లక్ష్యంగా భావిస్తున్న పార్టీల అధినేతలు సంపన్నులతో పాటు, సంపన్నులైన క్రిమినల్స్‌ను కూడా అక్కున చేర్చుకుంటున్నారు. సంపన్నుల కారణంగానే మన ప్రజాస్వామ్యం పచ్చగా ఉంది. కోటీశ్వరుల అండదండలు లేకపోతే పార్టీలు మూతపడతాయి. 

Show comments

Related Stories :