కమల్‌ 'బిగ్‌' క్వశ్చన్‌కి 'ఆన్సర్‌' ఎక్కడ.?

'కమల్‌హాసన్‌ హిందూ వ్యతిరేకి.. కమల్‌హాసన్‌ 'బిగ్‌ బాస్‌' షో పేరుతో అసభ్యతను చూపిస్తున్నాడు.. కమల్‌హాసన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి..' అంటూ హిందూ మక్కల్‌ కట్చి, విశ్వ నటుడు 'కమల్‌హాసన్‌'పై గుస్సా అవుతోన్న విషయం విదితమే. కమల్‌హాసన్‌పై ఈ మేరకు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది హిందూ మక్కల్‌ కట్చి. 

అయితే, ఈ వివాదంపై కమల్‌ 'తాపీ'గా స్పందించాడు. తాను కమ్యూనిస్టుని కాదనీ, రేషనలిస్ట్‌నని కమల్‌ చెప్పుకొచ్చాడు. అంతేనా, కమల్‌హాసన్‌ ఓ బిగ్‌ క్వశ్చన్‌ని కూడా సంధించాడండోయ్‌. 'బిగ్‌ బాస్‌ రియాల్టీ షోలో అసభ్యత గురించి ప్రశ్నిస్తున్నారు.. మరి, క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా ఛీర్‌ లీడర్స్‌ చేస్తున్నదేంటి.? దాన్నెవరూ ఎందుకు ప్రశ్నించరు.?' అంటూ ప్రశ్నాస్త్రం సంధించేశాడు కమల్‌హాసన్‌. ఇది కూడా పాయింటే మరి.! 

'నన్ను అరెస్ట్‌ చేయించాలనుకుంటే చేయించుకోవచ్చు.. నేనెవరికీ భయపడను. నేను చేసేది తప్పయితే శిక్ష అనుభవిస్తాను. అంతేతప్ప, ప్రతి చిన్న విషయానికీ నన్ను వివాదంలోకి లాగాలనుకుంటే ఊరుకునేది లేదు..' అంటూ హెచ్చరించేశాడు కూడా. కమల్‌ తమిళంలో 'బిగ్‌బాస్‌' షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ఈ వివాదం తెరపైకొచ్చింది. షోలో అసభ్యత ఎక్కువగా వుందనీ, హిందూ మత విశ్వాసాల్ని దెబ్బతీసేలా షో జరుగుతోందనీ హిందూ మక్కల్‌ కచ్చి ఆరోపిస్తోంది. 

ఇదిలా వుంటే, కమల్‌పై హిందూ మక్కల్‌ కట్చి ఆగ్రహం ఈనాటిది కాదు. గతంలోనూ ఆయనపై పలుమార్లు హిందూ మక్కల్‌ కట్చి ఆగ్రహం వ్యక్తం చేసింది.. పోలీసులను ఆశ్రయించింది కూడా.! అఫ్‌కోర్స్‌ దిష్టిబొమ్మల దహనాలు మామూలేననుకోండి.. అది వేరే విషయం.

Show comments