లక్ష కోట్లు ఎలా ఇచ్చేస్తారు.?

47,500 కోట్ల రూపాయలతో రాజధానికి సంబందించిన 'డిటెయిల్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డిపిఆర్‌)ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిందట. అందులో సగం.. కాకపోతే కనీసం పదోవంతు.. అంటే అటూ ఇటూగా ఐదు వేల కోట్లన్నా కేంద్రం ఇవ్వకపోతుందా.? అని బహుశా చంద్రబాబు సర్కార్‌ ఆశించి వుండొచ్చుగాక.! 

ఈ లెక్కల విషయంలో మొదటి నుంచీ చంద్రబాబుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లెక్కల విషయంలో చంద్రబాబు ఆకాశమే హద్దు.. అన్నట్లుగా చెలరేగిపోతుంటారు. 'రైతుల రుణాల్ని తీర్చేస్తాం..' అని ఎన్నికల వేళ 'హామీ' ఇచ్చిన చంద్రబాబు, ఆ రుణాల్ని మాఫీ చేసే విషయమై ఎన్ని పితలాటకాలు పెట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! ఇంటికి ఓ ఉద్యోగం అన్నారు. నిరుద్యోగ భృతి అన్నారు. ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కావని అందరికీ తెల్సిన విషయాలే. కానీ, ఎంతో కొంత చంద్రబాబు చెయ్యకపోతారా.? అని జనం ఆలోచించారు. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల వ్యవహారంలోనూ ఇదే జరిగింది. 

ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబే ఇలా వ్యహరిస్తోంటే, 29 రాష్ట్రాల్ని పరిపాలించే కేంద్రం ఇంకెలా ఆలోచించాలి.? నో డౌట్‌, కేంద్రం.. ఆంధ్రప్రదేశ్‌ని ఆదుకుని తీరాల్సిందే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అయితే, కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విషయంలో చంద్రబాబు తీరు మొదటినుంచీ అనుమానాస్పదమే. 'మాకు డీపీఆర్‌ ఇవ్వండి..' అని కేంద్రం అడిగినప్పుడు చంద్రబాబు మొహమాటపడ్డారు. ఇప్పటిదాకా పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రానికి 'అప్పగింతలు' చంద్రబాబు పూర్తిచెయ్యలేదు. 

రాజధాని అమరావతి విషయానికొస్తే, ప్రపంచ స్థాయి రాజధాని.. అంటూ లక్షల కోట్ల లెక్కలు చెబుతున్నారు. ఇంతవరకు రాజధాని డిజైన్‌ ఖరారు కాలేదు. అలాంటప్పుడు కేంద్రమెలా నిధుల్ని విడుదల చేయగలుగుతుంది.? డీపీఆర్‌ ఇచ్చేశామని ఏపీ ప్రభుత్వం తరఫున టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చెబుతున్నారు. డిజైన్లు ఇంకా ఖరారు కాలేదని, డెవలపర్‌ ఎంపికలోనూ ఇంకా స్పష్టత రాలేదని మంత్రి నారాయణ చెబుతున్నారు.  Readmore!

ఇదిగో పని.. ఇలా మొదలు పెట్టాం.. ఇంత ఖర్చవుతుంది.. అని లెక్కలు చెబితే, ఆ తర్వాత బాధ్యత కేంద్రం భుజాల మీదకు వెళుతుంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ విషయంలో శ్రద్ధ పెట్టకపోవడంతోనే ఈ సమస్యలన్నీ వచ్చిపడ్తున్నాయి. ఓ రాష్ట్రానికి 47,500 కోట్లు కేంద్రం ఎలా ఇచ్చేస్తుందని చంద్రబాబు ఆశించారట?

Show comments