అదే జరిగితే చంద్రబాబు పరువు పోతుంది!

హైకోర్టు విభజన వ్యవహారం ఇప్పుడు తారస్థాయికి చేరుకుంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు గవర్నరు చొరవతోనే ఈ స్టెప్‌ పడినట్లుగా తెలుస్తున్నది. ఖచ్చితంగా దీనిని తేల్చేసి ప్రతిష్టంభనను తొలగించడానికి కేంద్రం కసరత్తు చేస్తున్నదని అర్థమవుతోంది. ఇప్పుడు ఆ పర్వం పూర్తయి, హైకోర్టు విభజన అనేది పూర్తయితే గనుక చంద్రబాబు సిగ్గుపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హైకోర్టు విభజనే జరిగితే.. అది కచ్చితంగా కేసీఆర్‌ విజయం కిందకు వస్తుందని, చంద్రబాబు అసమర్థతకింద పరిగణనలోకి వస్తుందని విశ్లేషకుల అంచనా. వివరాల్లోకి వెళితే... 

తెలంగాణ న్యాయవాదులు, ప్రభుత్వం అందరూ కూడా తొలినుంచి హైకోర్టు విభజనకు తక్షణం పట్టుపడుతూ ఉన్నారు. అయితే దీనికి తర్కబద్ధమైన కారణాలు ఏమీ చెప్పకుండానే... చంద్రబాబునాయుడు మాత్రం హైకోర్టు విభజన పట్ల విముఖత ప్రదర్శిస్తూ వచ్చారు. హైకోర్టు కట్టుకోవడానికి కేంద్రం నిధులు ఇవ్వాలి.. అనే కారణాన్ని ఆయన చెబుతారే గానీ.. అది కేవలం సాకు మాత్రమే అని బయటపడిపోతూనే ఉంటుంది. 

న్యాయవాదుల నియామకం, ఏపీకి చెందిన వారు తెలంగాణ ఆప్షన్‌లను ఎంచుకోవడం... అదంతా పెను వివాదంగా మారడం.. ఈ నేపథ్యంలో హైకోర్టు విభజన తక్షణం జరగాల్సిందే అనే డిమాండ్‌ ఉద్యమరూపం దాల్చడం వరకు అందరికీ తెలిసిందే. చంద్రబాబునాయుడు ఇష్టానికి వ్యతిరేకంగా ఈ విషయంలో గవర్నరు నరసింహన్‌ కూడా విభజనకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ప్రక్రియను ఎలా పూర్తి చేయవచ్చు అనే దిశగా ఆయన తనదైన కసరత్తు చేశారు. దాని పర్యవసానం కేంద్రం కూడా కలుగ జేసుకుంది. ప్రస్తుతం కేంద్రమంత్రి సమక్షంలో ఢిల్లీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు , గవర్నరు లతో భేటీ లో తేల్చాలనే వరకు వచ్చింది.
 
ఇదే కీలక ఘట్టం. ఒకవైపు చంద్రబాబు భవనం లేదనే సాకు చూపించి, భవనానికి కేంద్రం నిధులు ఇవ్వాలని మాటలు చెబుతూ హైకోర్టు విభజనలో కాలయాపన చేయాలని చూస్తున్నారు. కానీ.. ఒకసారి కేంద్రం సంకల్పిస్తున్న స్థాయిలో సీఎంల భేటీ జరిగిన తర్వాత... ఈ సాకులు కుదరవు. హైకోర్టు ప్రస్తుతం ఉన్న భవనం వద్దనే కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి భవన వసతి కల్పించేస్తే.. ఇక చంద్రబాబు సాకులు చెప్పడానికి చాన్సుండదు. 

అలా భవన వసతిని కల్పించడానికి తెలంగాణ సర్కారు సిద్ధంగానే ఉంది. నిన్నటివరకూ హైదరాబాదులో ఉన్న సచివాలయాన్ని రెండు రాష్ట్రాలు ఎలా వాడుకున్నాయో... హైకోర్టు ప్రాంగణాన్ని కూడా అదే రీతిగా రెండు భాగాలుగా వాడుకోవచ్చుననే ఏర్పాటు జరిగే అవకాశం ఉంది. దాన్ని చంద్రబాబు కాదనడానికి కూడా అవకాశం ఉండకపోవచ్చు. పైగా ఆ ప్రతిపాదనకు, ఏర్పాటుకు కేసీఆర్‌ సిద్ధంగా ఉంటారు. 

అదే జరిగితే చంద్రబాబునాయుడు సిగ్గుపోతుందనేది పలువురి భావన. ఇప్పుడు ఏపీ పర్యటన రూపంలో గవర్నరు నరసింహన్‌ చంద్రబాబునాయుడుతో భేటీ అయి హైకోర్టు విభజన అంశాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చారు. చంద్రబాబు విభజన కష్టాలను, సమస్యలను గవర్నరుకు వివరించారంటూ... ఆయన విడుదల చేసే ప్రెస్‌నోట్‌లు తప్పుదోవ పట్టిస్తూ ఉంటాయి గానీ.. వాస్తవానికి హైకోర్టు వంటి కీలకాంశాలు గవర్నరు ఎజెండాలో ప్రధానంగా ఉంటాయన్నది అంచనా వేయవచ్చు. 

హస్తిన భేటీ కంటె ముందు వీరి భేటీకి చాలా ప్రాధాన్యం ఉంది. ఈ భేటీల పర్యవసానంగా హైకోర్టు విభజన జరిగిందంటే.. మాత్రం దానికి బలవంతంగా అడ్డుపడిన పాపానికి, దాన్ని తప్పించుకోజూసిన వక్రపు ఆలోచనలకు చంద్రబాబునాయుడు పరువు పోతుందని ప్రజలు భావిస్తున్నారు. 

Show comments