ఆ బద్మాష్ గాడిని పట్టారు..శభాష్ బెంగళూరు పోలీస్

అంత అరాచకమా, నడి రోడ్డు మీద ఆడపిల్లను నడవనివ్వరా? అక్కచెల్లెళ్లు ఉన్న ప్రతి వాడి కంట్లోనూ సన్నటి కన్నీటి పొర  జనిస్తుంది ఆ వీడియోను చూస్తే. తన మానాన బిక్కుబిక్కుమంటూ వెళుతున్న ఆ అమ్మాయిపై అత్యంత కర్కశాన్నే ప్రదర్శించారు ఆ మృగాళ్లు. ఆమె ఎదురుతిరిగినా, గింజుకున్నా.. కనీసం జాలిదయ లేకుండా మానవత్వాన్ని చూపకుండా అత్యంత నైఛ్యానికి ఒడిగడ్డారు ఆ దుర్మార్గులు. నడి రోడ్డుపై నమోదైన ఆ కీచక పర్వం అక్కడే ఒక ఇంటికి అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డైంది.

ఈ సనాతన భారతంలో ఇలాంటి దుశ్శాసన పర్వాలు అడుగడుగునా నమోదవుతూనే ఉన్నా.. ఆ అమ్మాయి ఆవేదన మాత్రం చాలా మందిని కదిలించింది. ఈ లైంగిక దాడి యత్నం.. సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. ఆమెపై ఆ దాష్టీకం పట్ల చాలా మంది ఆవేదన భరితులయ్యారు. అర్దరాత్రో అపరాత్రో ఉద్యోగం నుంచి వచ్చే మన ఆలికైనా, చెల్లికైనా ఇంతే కదా.. అనే భావన ప్రతి భారతీయుడి మదినీ తాకింది.

ఇలాంటి ఆవేదన నుంచి కొంత ఊరట. బెంగళూరులోజరిగిన ఈ సంఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ దుశ్శాసనుల్లో ఒకడిని అదుపులోకి తీసుకున్నారు. వాడు ఆ ప్రాంతం వాడు, ఆమెను ఎరిగిన వాడు కావడం గమనార్హం. ఆ అమ్మాయి రెగ్యులర్ గా వెళ్లే కిరాణా కొట్టులో వాడు పని చేస్తుంటాడట. ఆ దుర్మార్గులు స్థానికులే అయ్యుంటారన్న అంచనాలతో వారిలో ఒకడినైనా పట్టుకున్న పోలీసులను అభినందించి తీరాలి. ఇదే సమయంలో రెండో వాడిని కూడా పట్టుకుని.. మళ్లీ బద్మాష్ గాళ్లెవరూ ఇలాంటి పనులు చేయకుండా బుద్ధి చెప్పాలనేది సగటు మనిషి కోరిక.

Show comments