మోడీ 'వ్యూ': రాజకీయ అవినీతికి చట్టబద్ధత

రాజకీయం అంటే నిజానికి సేవ.. ఇది ఒకప్పటి మాట. కానీ, రాజకీయం అంటే ఇకపై సుప్రీం. అవును, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకున్నా ఇది నిజం. రాజకీయాలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సరికొత్త అర్థం చెబుతున్నారు. ఈ అకౌంట్‌లో 2 లక్షల రూపాయల డిపాజిట్‌ అయ్యిందో, లెక్కలు చెప్పకపోతే తాట తీసేస్తారు. అదే, రాజకీయ పార్టీల ఖాతాల్లో అయితే ఎంత మొత్తం జమ చేసినా నో ప్రాబ్లెమ్‌.! 

అసలు, దేశంలో అవినీతి ఎక్కడినుంచి పుట్టుకొస్తోంది.? నల్లకుబేరులు దేశంలోని ఏ రంగంలో ఎక్కువగా వున్నారు.? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడం పెద్ద కష్టమేమీ కాదు. రాజకీయమే అవినీతి అంతటికీ కారణం. ఇది జగమెరిగిన సత్యం. మరి, ఆ రాజకీయ పార్టీల్ని ఇక్కడ 'కాపాడటం' అంటే, నరేంద్రమోడీ ఉద్దేశ్యం ఏంటట.? అంటే, నల్లధనానికి 'సేఫ్టీ లాకర్స్‌'గా రాజకీయ పార్టీల్ని మార్చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ కంకణం కట్టుకున్నారనే విషయం అర్థమవుతోంది కదా.! 

ఇదే విషయాన్ని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ లేవనెత్తారు. పార్లమెంటు సమావేశాల్లో నరేంద్రమోడీ అవినీతి బట్టబయలు చేస్తాననీ, ఇందుకు తగ్గ ఆధారాలు తన వద్దనున్నాయనీ, తాను మాట్లాడితే భూకంపం వచ్చేస్తుందనీ చెప్పిన ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యాక పూర్తిగా మారిపోయారు. పార్లమెంటులో ఆధారాలు చూపే అవకాశం రాకపోతేనేం, కోర్టులకు వెళ్ళొచ్చుగా.! కానీ, వెళ్ళరు. ఎందుకంటే, అక్కడ మేటర్‌ వేరేలా వుంది. 

అటు ప్రధాని నరేంద్రమోడీ, ఇటు ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఒక్కటయ్యారు. అలా, రాజకీయ పార్టీల్ని 'నల్లధనం వెలికితీత' ప్రోగ్రామ్‌ నుంచి దూరం పెట్టారన్నమాట. తెలుగులో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో 'లీడర్‌' సినిమా వచ్చింది. అందులో, అవినీతి సొమ్ముని బయటకు తీసే క్రమంలో సీఎం పొజిషన్‌లో వున్న హీరోగారికి, ఓ సీనియర్‌ రాజకీయ నాయకుడి పాత్రలో వున్న గొల్లపూడి మారుతీరావు ఓ సలహా ఇస్తారు. అదేంటంటే, అవినీతి అంతమొందించే కార్యక్రమం నుంచి రాజకీయ నాయకుల్ని పక్కన పెట్టమని. అప్పటిదాకా ఆ బిల్లు పాస్‌ అయ్యే అవకాశం వుండదు.. ఆ తర్వాతే సీన్‌ మారిపోతుంది. 

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో జరుగుతున్నదదే. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కి మిత్రపక్షమైన మజ్లిస్‌ పార్టీ, తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికరమైన పాయింట్‌ లేవనెత్తింది. కాంగ్రెస్‌, బీజేపీలకు గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల సమయంల వందల కోట్లు పార్టీ విరాళాలు ఎలా వచ్చాయి.? అని ప్రశ్నించారు ఆ పార్టీ నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ. అవినీతికి ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి.? 

మొత్తమ్మీద, నరేంద్రమోడీ దేశంలో రాజకీయాలే సుప్రీం.. అనే దిశగా పావులు కదుపుతున్నారు. మరి, నల్లధనం మీద యుద్ధమంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పడమెందకట.. సామాన్యుల్ని పీక్కు తినడం తప్ప.!

Show comments