అఖిలపక్షమంటే బాబుకి భయమెందుకు.?

బీహార్‌ మద్దతిచ్చింది.. ఉత్తరప్రదేశ్‌ కూడా కేంద్రాన్ని నిలదీసింది.. పశ్చిమబెంగాల్‌, ఒరిస్సా.. అందరూ ఆంధ్రప్రదేశ్‌కి విభజనతో జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయాన్ని సరిదిద్దాలనీ, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలనీ రాజ్యసభలో నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌ కోసం, తెలంగాణ సహా దేశంలోని చాలా రాష్ట్రాలు ముందుకొచ్చినా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ప్రతిపక్షాన్ని కలుపుకుపోలేకపోతున్నారు. 

వాస్తవానికి, ఆంధ్రప్రదేశ్‌కన్నా ముందుగా ఎప్పటినుంచో ప్రత్యేక హోదా కోసం డిమాండ్‌ చేస్తోంది బీహార్‌. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్‌తో విభేదిస్తోంది ఒరిస్సా. ఈ రెండు రాష్ట్రాలూ ఆంధ్రప్రదేశ్‌ తరఫున మాట్లాడుతున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ని చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు కలుపుకుపోరు.? ఇదే ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. 

'అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి..' అంటూ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రాజకీయ పార్టీలూ (టీడీపీ, బీజేపీ మినహా) డిమాండ్‌ చేస్తున్నాయి. కానీ, చంద్రబాబు అఖిలపక్షం దండగ అంటున్నారు. జాతీయ స్థాయిలో అందరూ మద్దతిచ్చినా కేంద్రం లెక్కచేయనప్పుడు అఖిలపక్షమెందుకు దండగ.? అన్నది చంద్రబాబు వాదన. కానీ, చంద్రబాబు ఇక్కడో లాజిక్‌ మిస్సవుతున్నారు. మిగతా అందరూ అడగడం ఒక ఎత్తు.. ఆంధ్రప్రదేశ్‌ గట్టిగా అడగడం ఇంకో ఎత్తు. 

'ప్రత్యేక హోదా సంజీవని ఏమీ కాదు..' అని చంద్రబాబు గతంలో అనకపోయి వుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. వైఎస్‌ జగన్‌, ప్రత్యేక హోదా కోసం దీక్ష చేసినప్పుడు ప్రభుత్వం దాన్ని అణచివేయకుండా వుండి వుంటే, ఇప్పుడు పరిస్థితులు ఇంకోలా వుండేవి. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి అయిన వెంటనే, కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి వుంటే, 'ఆ పెయిన్‌' ఏంటో, కేంద్రానికి అర్థమయ్యేది. 

ఇప్పటికైనా చంద్రబాబు కళ్ళు తెరిస్తే, విపక్షాలు ఢిల్లీ వేదికగా కేంద్రంపై పోరును ఉధృతం చేసేందుకు అవకాశం లేకపోలేదు. కానీ, ఇక్కడ చంద్రబాబు, నరేంద్రమోడీని 'మెత్తుతూ' వుంటే, విపక్షాలు ఎంత ఆందోళన చేసినా ఉపయోగమేముంటుంది.? రాజ్యసభలో ఇటీవల అరుణ్‌ జైట్లీ ప్రసంగం సందర్భంగా చంద్రబాబుకి రక్తం మరిగిపోయిందట. కామెడీ కాకపోతే, రక్తం మరిగిపోతే ఆ వ్యక్తి చంద్రబాబులా వుంటారా.? 'ఇక్కడితో మీతో కటిఫ్‌..' అంటూ బీజేపీకి అల్టిమేటం జారీ చేసేవారు. 

ఇద్దరు ఎంపీలతో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. 25 మంది ఎంపీలతో ఆంధ్రప్రదేశ్‌, ప్రత్యేక హోదా సాధించలేదా.? చంద్రబాబూ సిగ్గు సిగ్గు. 

Show comments