టీడీపీ జ్యోతీష్యులారా.. మీ జాతకాలూ చూసుకోండి!

భారతీయ జనతా పార్టీకీ కాంగ్రెస్ కు పట్టిన గతే.. అని అంటున్నారు తెలుగుదేశం ఎంపీలు, ఎమ్మెల్యేలు! ప్రత్యేక హోదా అంశం విషయంలో బీజేపీ మోసపూరిత వైఖరిని అనుసరిస్తోందని.. హోదాపై మాట తప్పుతోందని అంటూ వీరు విరుచుకుపడుతున్నారు. తెలుగుదేశం నేతలు బోండా ఉమ, కేశినేని నాని తో సహా అనేక మంది పచ్చపార్టీ వాళ్లు ఈ మాట చెబుతున్నారు.

వీరి మాటల్లో నిజముంది.. ప్రత్యేక హోదా అంశంపై ఎన్నికల ముందు బీజేపీ ఎంత హడావుడి చేసిందో వేరే వివరించనక్కర్లేదు. ఏపికి ఐదు, పది కాదు.. పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలని రాజ్యసభలో వెంకయ్య నాయుడే డిమాండ్ చేశాడు. అయితే ఇప్పుడు మాత్రం అదంతా అయిపోయిన కథ.. ఏపీకి ప్రత్యేక హోదా దక్కకపోవడానికి కారణం కాంగ్రెస్సే అని వారు అంటున్నారు. ఇలా మాట మార్చినందుకు బీజేపీకి కూడా కాంగ్రెస్ గతే పడుతుందని పచ్చపార్టీ జ్యోతీష్యులు చెబుతున్నారు. 

వీళ్ల కథ ఎలా ఉందంటే.. బీజేపీతో  అంటకాగడం వేరు, ప్రత్యేక హోదా అంశం వేరు! అని ఏపీ జనాల చెవుల్లో పూలు పెడుతూ, ఈ విషయంలో తాము విజయవంతం అయిపోయామని ఫిక్స్ అయిపోయి, కమలం పార్టీకి శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టారు. ప్రత్యేక హోదా అనేది కేవలం బీజేపీ బాధ్యత మాత్రమే, ఆ పార్టీతో కలిసి కేంద్రంలో పదవులను పంచుకున్న మాకు ఏ మాత్రం సంబంధం లేదు.. ప్రత్యేక హోదా దక్కకపోవడానికి పూర్తి దోషి బీజేపీ మాత్రమే, ఏపీ జనాలు ఈ విషయంలో బీజేపీని మాత్రమే శిక్షిస్తారు.. మమ్మల్ని కాదు అనే వాదన వినిపిస్తున్నారు. 

అత్యంత అతి తెలివి వాదనను వినిపిస్తున్నామని తెలుగుదేశం నేతలు భావిస్తున్నట్టున్నారు పాపం! ప్రత్యేక హోదా అంశంపై వేరే వాళ్లు గట్టిగా మాట్లాడితే.. ఈ విషయంలో బీజేపీపై టీడీపీ నేతలు ఎందుకు ఒత్తిడి తీసుకురారు? అని ఎవరైనా ప్రశ్నిస్తే, అదంతా కుట్ర అంటారు. మమ్మల్నీ బీజేపీని విడదీయడానికి అలాంటి కుట్ర చేస్తున్నారంటూ వారిపై విరుచుకుపడతారు. మరోవైపు జనాలను బ్లఫ్ చేయడానికి బీజేపీని దోషి అని అంటారు!

ఇంతకీ తెలుగుదేశం నేతల బాధ ఏందో అర్థం కాదు. ఒక్కటైతే నిజం.. బీజేపీ, తెలుగుదేశం జాతకాలు వేర్వేరు కాదు! ఎన్నికల్లో కలిసి పోటీ చేసి, తమ జోడీ సూపర్ హిట్ అని.. కలిసి అధికారంలో ఉంటూ పదవులను పంచుకుంటున్న వీళ్లిద్దరూ వేర్వేరు అని వాళ్లు వాళ్లు అనుకొంటున్నారేమో కానీ, వీళ్లందరినీ ప్రజలు ఒకటిగానే చూస్తున్నారు. తమ రాజకీయ అవకాశ వాదాన్ని జనాలు గుర్తించడం లేదు అని తెలుగుదేశం నేతలు భ్రమ పడుతున్నట్టుగా ఉన్నారు. ఎలాగూ కాంగ్రెస్ పట్టిన గతి పడుతుందని టీడీపీ నేతలే అంటున్నారు కాబట్టి.. అది కేవలం  బీజేపీకి మాత్రమే పట్టేది కాదు, తమకు కూడా పడుతుందని వారు గ్రహిస్తే మంచిది!

Show comments