మోడీకీ తమిళనాడు ఝలక్.. ఇదంతా జయ డ్రామానా?!

తమిళనాట ఇంతకీ ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? అసలు జయలలితను ఎవ్వరినీ ఎందుకు కలవనివ్వడం లేదు? ఈ విషయంలో తమిళనాడు ఉన్నతాధికారుల అత్యుత్సాహం ఏమిటి? ఆసుపత్రి లోపల వరకూ వెళ్లి వచ్చిన గవర్నర్ జయను తను పలకరించినట్టుగా గానీ, ఆమెను కనీసం చూసినట్టుగా కానీ ఎందుకు చెప్పలేకపోయాడు? అసలు ఆయనకే జయలలిత దర్శనం దక్కలేదా? జయలలిత దత్తపుత్రుడికి కూడా ఆసుపత్రి లోపలకు ఎందుకు అనుమతి లభించలేదు? జయలలిత “చాలా కాలం’’ పాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందాలని ఆపోలో వైద్యులు ప్రకటన చేయడం వెనుక మర్మం ఉందా?

ఇవన్నీ సామాన్యుల్లో కలుగుతున్న సందేహాలు అయితే.. ఇక వ్యాపిస్తున్న రూమర్లకు అయితే కొదవే లేదు. జయలలిత మరణించి కొన్ని రోజులు గడిచిపోయాయనే మాట తమిళ నాట గట్టిగా ప్రచారం జరుగుతోంది. అయితే వీటిని అధికారులు ఖండిస్తున్నారు. ఈ తరహా రూమర్లను వ్యాప్తి చేసే వాళ్లపై చర్యలు అని ప్రకటించారు. ఈ మేరకు కొందరిపై కేసులు కూడా బుక్ చేశారు. వైద్యుల ప్రకటనలను బట్టి చూస్తే.. జయలలిత విషయంలో ‘మరణం’ అనేది రూమర్ మాత్రమే అనుకోవాల్సి వస్తోంది.

మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇక్కడి పరిస్థితిని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిన ప్రధాని మోడీకి ఝలక్ తగిలిందనేది! జయ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడాని, ఆమెతో ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నించిన మోడీకి ఆ అవకాశం లభించలేదని తెలుస్తోంది. అసలు విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించిన ఆయన తమిళనాడు మార్కు షాక్ తగిలించుకున్నాడని సమాచారం. గవర్నర్ ఆసుపత్రికి వచ్చినప్పుడు… ఆయనకు జయలలిత చికిత్స పొందుతున్న ఐసీయూలోకి వెళ్లడానికి అనుమతి లభించలేదు! చేయగలిగింది ఏమీలేక విద్యాసాగర్ రావు.. వైద్యులతో మాత్రమే మాట్లాడి బయటకు వచ్చాడు.

గవర్నర్ ను అడ్డుకోగలిగిన శక్తులే.. జయలలిత గురించి ప్రధానికి కూడా అసలు విషయాన్ని తెలియకుండా చేశాయని తెలుస్తోంది. మోనార్క్ లాంటి జయ బెడ్ మీద ఉండి కూడా ఈ విధంగా శాసిస్తోంది.

మరి ఎందుకిలా అంటే.. ఇదంతా ఆస్తుల కేసు విచారణకు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆమె నడిపిస్తున్న హైడ్రామా! అనే మాటా వినిపిస్తోంది! ప్రత్యేకించి అపోలోవైద్యులు చేసిన ప్రకటనను బట్టి చూస్తే.. ఇప్పుడు మళ్లీ ఆస్తుల కేసు విచారణను ఎదుర్కొనే ఆసక్తి కానీ, ఓపిక కానీ ఆమె లో లేవు.. అందుకే “చాలా కాలం’’ పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుంది.. అనే ప్రకటన చేయించారేమో అనే అనుమానాలూ కలుగుతున్నాయి.

అలాగే జయలలిత ఆరోగ్యం దెబ్బతిన్నది ఆమె కర్ణాటకలోని జైల్లో ఉన్నప్పుడే.. అనే మాటను కూడా ఇప్పుడు ఒత్తి చెబుతున్నారు. ఇదంతా కూడా.. మళ్లీ విచారణ, రాజీనామా వంటి ప్రమాదాలను తప్పించుకోవడానికి వేస్తున్న ఎత్తుగడలే అనే మాట మాట్లాడుతున్నాయి తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అనుకూల వర్గాలు.

ఇక బీజేపీ వాళ్లేమో.. రాష్ట్రపతి పాలన ద్వారానో ఇంకో రకంగానో అన్నాడీఎంకేను గంపగుత్తగా స్వాధీనం చేసుకుందామనో ప్రయత్నాలు మొదలుపెట్టేలా ఉన్నారు. అయితే జయ పరిస్థితి ఏమిటో తెలుసుకుని ముందుకు వెళదామనుకుంటే, ఈ విషయంలో ప్రధానికే భంగపాటు ఎదురైనట్టుగా తెలుస్తోంది. జయలలితా.. మజాకా!

Show comments