కేంద్ర మంత్రి సుజనా చౌదరి నిన్న ఢిల్లీలో హంగామా చేశారు.. నేడు హైద్రాబాద్‌లో వాలిపోయారు. ప్రత్యేక హోదాపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలతో సమావేశం నిర్వహించిన సుజనా చౌదరి, అక్కడేం జరిగిందో నేడు హైద్రాబాద్‌లో గవర్నర్ నరసింహన్‌కి వివరించారట.
ఏమిటీ వైపరీత్యం.? గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా.? ప్రత్యేక హోదా అంశం గురించి గవర్నర్‌తో కేంద్ర మంత్రి సుజనా చౌదరి చర్చించడానికేముంటుంది.? ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ముక్కున వేలేసుకుంటున్నారు. నిజమే మరి, ఇంతవరకూ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని మనం చూడలేదు. దాంతో, గవర్నర్ నరసింహన్ - కేంద్ర మంత్రి సుజనా చౌదరి భేటీపై రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి.
నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్‌తో సుదీర్ఘమైన భేటీ నిర్వహించారు. అదే సమయంలో, తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌తోపాటు, తెలంగాణ ఏజీ కూడా నరసింహన్ వద్దకు వెళ్ళారు. ఓటుకు నోటు కేసు నేపథ్యంలో ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై వైఎస్సార్సీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, కేసుని పునర్విచారించాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం, ఆ ఆదేశాల్ని అందుకోగానే ఏకే ఖాన్, గవర్నర్ వద్దకు.. అదీ కేసీఆర్ అక్కడే వున్న సమయంలో వెళ్ళడం.. ఇదంతా, చంద్రబాబుకి చెమటలు పట్టించేసిన వ్యవహారమే.
కోర్టులో వైఎస్సార్సీపీ పిటిషన్‌కి సానుకూల స్పందన వచ్చిన వెంటనే సుజనా చౌదరిని చంద్రబాబు అలర్ట్ చేసి వుండాలి. ఆ వెంటనే సుజనా చౌదరి, బీజేపీ జాతీయ అధ్యక్షుడితోనూ పలువురు కేంద్ర మంత్రులతోనూ మంతనాలు జరిపారన్నమాట. ఆ తర్వాత, గవర్నర్ వద్ద ఓటుకు నోటు కేసు విషయమై ఏం చర్చ జరిగిందో తెలుసుకోవడానికి సుజనా చౌదరి, ప్రత్యేక హోదా పేరుతో గవర్నర్ వద్దకు చేరుకున్నారన్నమాట. మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే తప్ప ఈ విషయం అర్థం కాదు.
అయితే, గవర్నర్ నరసింహన్ ఇలాంటి విషయాల్లో చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరిస్తారా.? చౌదరిగారి ఆరాటం వృధా ప్రయాసే అవుతుందా.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. మొత్తమ్మీద ఈ ఎపిసోడ్‌లో సుజనా చౌదరి కంగారు చూస్తోంటే, వ్యవహారం ఎక్కడో తేడా కొట్టినట్లే వుంది మరి.