సరదాకి: వెంకయ్యా.. జండూబామ్‌ ప్లీజ్‌.!

రాజకీయాల్లో 'ప్రాసకోసం' పాకులాడేవారి లిస్ట్‌ తీస్తే, అందులో ఫస్ట్‌ ప్లేస్‌ మన వెంకయ్యనాయుడుగారికే దక్కుతుంది. దేశంలోనే కాదు, ప్రపంచ రాజకీయాల్లోనే వెంకయ్య వెరీ వెరీ స్పెషల్‌. ఆయన మన తెలుగువాడైనందుకు మనందరం గర్వపడాలేమో.! 

మచ్చుకి ఒక ప్రాస డైలాగ్‌ వదులుకుందామా.. గెట్‌ రెడీ.! 

రిఫామ్‌.. పెర్ఫామ్‌.. ట్రాన్స్‌ఫామ్‌.. 

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ పర్యటించిన సందర్భంలో వెంకయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. వెంకయ్య అలా మాట్లాడుతుండగానే, 'ప్లీజ్‌ వెంకయ్యా.. మాకో జండూబామ్‌..' అంటూ అక్కడి జనం అనుకున్నారో లేదోగానీ, టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం తిలకరించినవారిలో చాలామంది మాత్రం జండూబామ్‌ కోసం వెతుక్కున్నారు. అంతకు ముందే బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన వెంకయ్య.. అక్కడా ప్రాసతోనే చంపేశారు. 

Readmore!

వామ్మో, ప్రాసతో వీక్షకుల ప్రాణాలు తోడెయ్యొచ్చా.? అంటే, ఎందుకు తోడెయ్యకూడదు.. మన వెంకయ్యగారు లేరూ, అందులో ఆయన పీహెచ్‌డీ చేసేశారు ఏకంగా.. అని చెప్పుకోవాలి మనం. వెంకయ్యనాయుడు ఎవర్నన్నా పొగడాలనుకుంటే చాలు, ప్రాసతో కూడిన డైలాగులు వచ్చేస్తాయి. అలా పొగిడించుకున్నవారిలో రామోజీరావు, చంద్రబాబు, అరుణ్‌ జైట్లీ.. ఇలా చాలామందే వున్నారు. నరేంద్రమోడీ భజన గురించి చెప్పుకోవాలంటే అదో పెద్ద కథ.! 

పైన ఉదాహరణలో పేర్కొన్నవి కేవలం మూడు పదాలు మాత్రమే. ఒక్కోసారి ఐదారు, అరుదుగా పదికిపైనే పదాల్ని ప్రాసలో అమర్చి, వెంకయ్యనాయుడు ప్రసంగంలో దంచేస్తుంటారు. ఇది ఆయనకు మాత్రమే తెలిసిన విద్య. ఆ రకంగా వెంకయ్యనాయుడు వెరీ వెరీ గ్రేట్‌. కానీ, పరమ బోరింగ్‌ ప్రసంగాలు చేసేస్తున్నారు వెంకయ్య ఇటీవలి కాలంలో. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించేటప్పుడు వెంకయ్య చేసే ప్రసంగాలన్నీ ఒకేలా వుంటున్నాయి. ఓ ప్రసంగాన్ని రికార్డ్‌ చేసి, రిపీట్‌ చేస్తే సరిపోద్దేమో.! 

సుదీర్ఘ రాజకీయ అనుభవం వెంకయ్యనాయుడు సొంతం. అదే సమయంలో, జనం తన గురించీ, తన ప్రసంగాల గురించీ ఏమనుకుంటున్నారో తెలుసుకోకపోతే ఎలా.? బహుశా ఇదే వృద్ధాప్యం కారణంగా వచ్చిన ఛాదస్తం అనుకోవాలేమో.!

Show comments