కాబట్టి, జగన్‌ రాకూడదంతే.!

రాజధాని అమరావతిని వ్యతిరేకించిన వైఎస్‌ జగన్‌, అమరావతి ప్రాంతంలో పార్టీ ప్లీనరీ ఎలా నిర్వహిస్తారంటూ మంత్రి కళా వెంకట్రావు గట్టిగా ప్రశ్నించేశారండోయ్‌.! ఇంకో మంత్రిగారు యనమల రామకృష్ణుడు అయితే ఏకంగా వైఎస్‌ జగన్‌ నేరాల చరిత్ర పేరుతో ఓ పుస్తకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించేశారు. టీడీపీ నేతలు ఒకరొకరుగా వైఎస్‌ జగన్‌ మీద దుమ్మెత్తిపోసేయడం మొదలెట్టేశారు తాజాగా. 

ఇంతకీ, టీడీపీ నేతల ఆగ్రహానికి కారణం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ప్లీనరీని అమరావతిలో నిర్వహిస్తుండమే. వైఎస్‌ జగన్‌, అమరావతిని వ్యతిరేకించిందెక్కడ.? రాష్ట్ర ప్రజలకు సంబంధించిన రాజధాని విషయంలో అందరి అభిప్రాయాల్నీ తీసుకోవాలని మాత్రమే వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. రాజధానికి సంబంధించి కేంద్రం నియమించిన కమిటీ, అమరావతి ప్రాంతం రాజధానికి అనుకూలం కాదని చెబితే, ఆ విషయంపై నెలకొన్న సందేహాలకు నివృత్తి మాత్రమే అడిగారు వైఎస్‌ జగన్‌. 

సరే, వైఎస్‌ జగన్‌ మీద అక్రమాస్తుల కేసులు వున్నాయన్నది అందరికీ తెల్సిన విషయమే. అవి కోర్టు పరిధిలో వున్నాయి. చాలా అంశాలపై అధికార పార్టీ ఇరకాటంలో పడినప్పుడు, 'కోర్టు పరిధిలో వున్న అంశంపై మాట్లాడలేం..' అని సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు కదా.. మరి, వైఎస్‌ జగన్‌ మీద కేసుల విషయంలో టీడీపీకి ఎందుకంత అత్యుత్సాహమట.? 

న్యాయస్థానం వైఎస్‌ జగన్‌ని నేరస్తుడిగా నిర్ధారిస్తే, అది వేరే విషయం. ఈలోగానే టీడీపీ వైఎస్‌ జగన్‌ని, నేరస్తుడిగా డిక్లేర్‌ చేసేయడం హాస్యాస్పదం కాక మరేమిటి.! ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి రెడ్‌ హ్యాండెడ్‌గా బుక్‌ అయిపోయినా, చంద్రబాబు బ్రీఫింగ్‌ చేసేసి దొరికిపోయినా, అదంతా 'కుట్ర' మాత్రమే. అదే జగన్‌ విషయానికొస్తే మాత్రం, వ్యవహారం వేరేలా వుంటుంది. 

2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ, అధికారం చేజిక్కించుకోలేకపోయిన మాట వాస్తవం. 2019 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ ప్లీనరీలో సరికొత్త నిర్ణయాల్ని ప్రకటించి, సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్ళాలన్నది వైఎస్సార్సీపీ యోచన. మొన్నీమధ్యనే టీడీపీ మహానాడు కూడా జరిగింది కదా.! ఏ రాజకీయ పార్టీ అయినాసరే ప్లీనరీలు నిర్వహించడం సర్వసాధారణమైన విషయమే. 

అమరావతి విషయంలో అభ్యంతరాలున్నంతమాత్రాన వైఎస్‌ జగన్‌, అమరావతికి రాకూడదంటే ఎలా.? 2014 ఎన్నికల్లో ఓడిపోయినంతమాత్రాన ప్లీనరీ నిర్వహించుకునే హక్కు లేదనీ, ప్రజలు తిరస్కరించేశారు గనుక, మూసేసుకోవాలంటే ఎలా.? 2004, 2009 ఎన్నికల్లో టీడీపీని ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రజలు తిరస్కరించిన విషయాన్ని టీడీపీ నేతలు మర్చిపోవడం శోచనీయం.

Show comments