ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యం భారతీయ జనతా పార్టీకి లేదు. ఇది క్లియర్. కానీ, ఆ విషయాన్ని చెప్పే ధైర్యం కూడా ఆ పార్టీలో కనిపించడంలేదు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి సాక్షిగా నరేంద్రమోడీ, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా కావాలని రాజ్యసభలో వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. అదే రాజ్యసభలో అప్పటి ప్రధాని నరేంద్రమోడీతో, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ప్రకటన తెప్పించారు. ఆ తర్వాత ఎగ్గొట్టారు.
మొత్తంగా ఆరు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం గొంతు చించుకున్నా ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదు. ఆ ఆరు కోట్ల మంది ప్రజల గొంతుకల్ని కాంగ్రెస్, బీజేపీ కలిసికట్టుగా కోసి పారేశాయి. దీంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. విభజనతో కాంగ్రెస్, ప్రత్యేక హోదా ఎగ్గొట్టి, ఆంధ్రప్రదేశ్‌కి సమ అన్యాయం చేసేశాయి. చెయ్యాల్సిందంతా చేసేసి, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ కపట నాటకాలాడేస్తున్నాయి.
విభజన చట్టంలో ప్రత్యేక హోదాని పెట్టి వుంటే, ఇప్పుడీ సమస్య వచ్చేది కాదని వెంకయ్యనాయుడు చెబుతున్నారు. ఓ పక్క విభజన చట్టంలో పెట్టలేదంటారు, ఇంకోపక్క ఆల్రెడీ ప్రత్యేక హోదా వున్న రాష్ట్రాలకే ఆ హోదాని తీసేస్తామంటున్నారు. జీఎస్‌టీ అమల్లోకి వస్తే ప్రత్యేక హోదాతో ఉపయోగమే లేదని చెబుతుంటారు. ఏది నిజం.? ఏది అబద్ధం.? అన్నీ అబద్ధాలే. ఇందులో ఏదీ నిజం లేదు. ఈ అబద్ధాలు చాలవన్నట్లు, 9 రాష్ట్రాలు ప్రత్యేక హోదా అడుగుతున్నాయి గనుక, ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని వెంకయ్యనాయుడు చెబుతున్నారు.
నిజానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రం, విభజనను ఒప్పుకోలేదు. కేంద్రం తనకు నచ్చిన పద్ధతిలో విభజించేసింది. ఇది జగమెరిగిన సత్యం. అదే, ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో విభజనకు అనుకూలంగా తీర్మానం చేశారు. కానీ, అక్కడ విభజన జరగలేదు. ఇదొక్కటే కాదు, దేశవ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు చాలానే వున్నాయి. వేటికీ కేంద్రం అనుకూలంగా లేదు. మరి, ఆంధ్రప్రదేశ్‌కే ఎందుకు అన్యాయం జరిగినట్లు.?
కేంద్రం ఇవ్వాలనుకుంటే ఇస్తుంది, ఎగ్గొట్టాలనుకుంటే ఎగ్గొడుతుంది. అంతే తప్ప, రాష్ట్రాల అభిప్రాయాల్ని కేంద్రం గౌరవించే సంప్రదాయం ఎప్పుడో అటకెక్కేసింది. ఇంకా బొంకాల్సిన అవసరమేంటి.? మేం, ఇవ్వకూడదనుకున్నాం.. ఇవ్వడంలేదు.. అనేస్తే పోలా.? ఇంకా నయ్యం, అలా అనేస్తే, రాష్ట్రం నుంచి బీజేపీ మాయమైపోదూ.! కానీ, ఇలా బుకాయించుకుంటూ పోతే, 2019 ఎన్నికల నాటికి ఎటూ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అంతర్ధానమైపోతుందనుకోండి.. అది వేరే విషయం.