మజ్జిగకు గతిలేదు పెరుగుకు చీటీ ఇస్తాట్ట!

మజ్జిగకు గతిలేదు కానీ... పెరుగుకు చీటీ ఇస్తాట్ట అని మన పల్లెపట్టుల్లో సామెత. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరు అదేవిధంగా కనిపిస్తోంది. జనాన్ని బురిడీ కొట్టించడానికి మాయమాటల్ని పదేపదే చెబుతూ.. ఒకే మాటల గారడీని పలుమార్లు ప్రదర్శించడం వల్ల ప్రజల్ని నమ్మించేయగలం అనే సిద్ధాంతం అనుసరిస్తున్నట్లుగా కనిపించే చంద్రబాబు.. ప్రత్యేకప్యాకేజీకి చట్టబద్ధత విషయంలో అలాంటి ఎత్తుగడలే వేస్తున్నారు. ప్రత్యేకహోదా అనే డిమాండును రెండు ప్రభుత్వాలు కలిపి.. సమర్థంగా సర్వనాశనం చేసేసిన తర్వాత.. కేంద్రం ప్రకటించిన ముష్టి ప్రత్యేకప్యాకేజీని మహద్భాగ్యంగా కీర్తిస్తూ చంద్రబాబునాయుడు ప్రజలను మోసం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆయనకు కూడా లోలోపల ఆ ప్యాకేజీకి చట్టబద్ధత లేకపోవడం వల్ల ముందు ముందు ఏపీ దారుణంగా నష్టపోతుందనే భయం ఉంది. అందుకే ప్యాకేజీకి చట్టబద్ధత ఇవ్వండి బాబో అంటూ కేంద్రాన్ని బతిమాలుతున్నారు గానీ.. వారు ఇసుమంత కూడా ఖాతరు చేయడం లేదు. తాజాగా పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్న తరుణంలో తమ పార్టీ ఎంపీలకు కూడా ఆయన చట్టబద్ధత సాధించే విషయంలోనే దిశానిర్దేశం చేసి పంపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత అడగుతోంటే.. కేంద్రం చాలా అవమానంగా భావిస్తున్నట్లుంది. తమ మాట మీద నమ్మకం లేకనే చట్టబద్ధత అడుగుతున్నారని వారు భావిస్తున్నట్టుంది. అందుకే పట్టించుకోవడం లేదు. చంద్రబాబునాయుడు అమరావతిలో ఒక శంకుస్థాపన ఈవెంట్ కు అరుణ్ జైట్లీ ని ముఖ్యఅతిథిగా పిలిచి వేదికమీద విన్నవించినా.. ఆతర్వాత పలుమార్లు అదే పనిగా ఢిల్లీ వెళ్లి అరుణ్ జైట్లీని కలిసి చట్టబద్ధత అడిగినా ఆయన ఖాతరు చేయనేలేదు. విశాఖ సదస్సుకు అతిథిగా వచ్చినా ఆ ఊసు లేదు. చంద్రబాబు నేరుగా వెళ్లి అడిగితేనే దిక్కు లేదు గానీ.. నేను లెటర్రాస్తా.. మీరు వెళ్లి అడగండి, సాధించేయండి అంటూ చంద్రబాబునాయుడు తన పార్టీ ఎంపీలను పురమాయిస్తున్నారు. 

అయినా చట్టబద్ధత విషయంలో ఇన్ని నెలలుగా జనాన్ని మోసం చేయడం చంద్రబాబుకు మాత్రమే చెల్లింది. కేంద్రం ఇచ్చే ఉద్దేశంతో లేదని తెలిసి కూడా.. ఆయన ఎన్ని రకాల మాయమాటలు చెబుతున్నారో అర్థమవుతూనే ఉంది. టీడీపీపీ సమావేశం తర్వాత... సుజనా చౌదరి మాట్లాడుతూ మరో 15రోజుల్లోగా చట్టబద్ధత సాధించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. రెండు వారాల్లోగా చట్టబద్ధత రాకపోతే గనుక.. కేంద్రం నుంచి తాము వైదొలగుతాం అని చెప్పగల ధైర్యం వారికి ఉందా? సాధిస్తున్నాం సాధిస్తున్నాం.. అని జనాన్ని పదేపదే బురిడీ కొట్టిస్తూ.. మాయమాటలు చెబుతూ రోజులు గడిపేయడం తప్ప.. వాస్తవంగా ఆ ప్యాకేజీకి చట్టబద్ధత కూడా చంద్రబాబు సాధించలేడని విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఆ మాటకొస్తే.. జగన్ తన పార్టీ తరఫున హోదాకోసం ఉద్యమిస్తున్నారు. మేలోగా హోదా గురించి ప్రకటన రావాల్సిందేనని, లేకపోతే.. జూన్ లో తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్తాం అని జగన్ ప్రకటించారు. వాళ్లు ఆ పనిచేస్తారో చేయరో తర్వాతి సంగతి.. కానీ.. తన పోరాటానికి ఒక డెడ్ లైన్ విధించి.. ఆ మేరకు చురుగ్గా పోరాడే తత్వం కనిపిస్తోంది. ప్యాకేజీకి చట్టబద్ధత సాధిస్తాం.. అనే కనిష్టమైన అంశాన్ని పట్టుకుని అది కూడా చేతకాకపోగా.. ఒక నిర్దిష్ట ప్రణాళిక లేకుండా మాటల్తో పొద్దుపుచ్చడం చంద్రబాబుకే చెల్లుతోంది. 

Show comments