ఖైదీ, శాతకర్ణి.. రికార్డుల లొల్లి.!

ఓ తెలుగు సినిమా మంచి వసూళ్ళు సాధిస్తోందంటే సగటు తెలుగు సినీ ప్రేక్షకులంతా సంతోషించాలి. ఓ తెలుగు సినిమా, అత్యద్భుతంగా తెరకెక్కితే.. తెలుగువారంతా గర్వపడాలి. కానీ, అభిమానులు అలా అనుకోరు కదా. 'మా సినిమా హిట్టయ్యింది..' అన్న ఆనందం కన్నా, 'వాళ్ళ సినిమా హిట్టయ్యింది..' అన్న ఆందోళనే వారికి ఎక్కువగా వుంటుంది. ఇది అభిమానుల పైత్యం. 

ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలొచ్చాయి. అందులో ఒకటి 'ఖైదీ నెంబర్‌ 150' అయితే, ఇంకోటి 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా. సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు ఈ రెండు చిత్రాల్నీ ఆదరించాడు. ఇప్పుడిక వివాదం ఇంకేముంటుంది.? మామూలుగా అయితే వుండదు. కానీ, అభిమానులు అలా వుండరు కదా.! ఆ అభిమానుల్లోనూ దురభిమానులు వేరయా.! వాళ్ళే ఇప్పుడు లొల్లికి కారణమవుతున్నారు. 

సోషల్‌ మీడియా వేదికగా ఈ దురభిమానులు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. బాలయ్య పేరుని వాడుకుని, చిరంజీవి మీదా.. చిరంజీవి పేరు వాడుకుని బాలయ్య మీదా వారి వారి కసి తీర్చుకుంటున్నారు. రికార్డుల పేరుతో చిరు బ్యాచ్‌, ఇంకో కోణంలో బాలయ్య బ్యాచ్‌ (ఈ బ్యాచ్‌లు నిజంగానే ఆయా హీరోల అభిమానులేనా.?) రచ్చకెక్కుతున్నారు. మీడియాకెక్కి మరీ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. 

కందకి లేని దురద కత్తి పీటకెందుకు.? అని అన్నట్టు తయారైంది పరిస్థితి. 'నా మిత్రుడు, సోదరుడు బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా ఘనవిజయం సాధించాలి..' అంటూ చిరంజీవి తనంతట తానుగా, బాలకృష్ణకి విషెస్‌ చెప్పారు. బాలకృష్ణ కూడా అంతే, 'చిరంజీవి నా మిత్రుడు.. అతని సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవాలి..' అంటూ ఆకాంక్షించారు. అక్కడ చిరంజీవికి, బాలకృష్ణకి లేని గొడవ వీళ్ళకెందుకట.? 

ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు ఘనవిజయాలు సాధించాయి. చిన్న సినిమాల్లో 'శతమానంభవతి' కూడా ఆకట్టుకుంటోంది. సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు సంతోషించాల్సిన సందర్భమిది. అదే సమయంలో, తెలుగు సినీ పరిశ్రమ కూడా ఈ విజయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తోంది. దురదృష్టవశాత్తూ దురభిమానులే, రచ్చకెక్కుతున్నారు. వీళ్ళంతే మారరుగాక మారరు. 

Show comments