లోఫర్ సినిమాతో అట్టర్ ఫ్లాప్ అందుకున్న తర్వాత వరుణ్ తేజ కెరీర్ లో సడెన్ గా గ్యాప్ వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ వరుణ్ తేజ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ఆ మధ్య కాలికి దెబ్బ కూడా తగలడంతో, కాస్త ఆలస్యంగా సిద్ధమైంది మిస్టర్ మూవీ. ఏప్రిల్ 14న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై కేవలం వరుణ్ తేజ మాత్రమే కాదు.. ఇంకా చాలామంది హోప్స్ పెట్టుకున్నారు.
వరుణ్ తేజ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలంటే మిస్టర్ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలి. అటు దర్శకుడు శ్రీనువైట్లకు కూడా ఈ సినిమా చాలా కీలకం. ఆగడు, బ్రూస్ లీ లాంటి రెండు ఫ్లాపుల తర్వాత మిస్టర్ సినిమా తీస్తున్నాడు. వరుణ్ తేజ, నాగబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వైట్లపై ఉంది. దీంతోపాటు ఈ సినిమా సక్సెస్ తో స్టార్ డైరక్టర్ల బ్యాచ్ లోకి మళ్లీ
ఎంటరవ్వాలని శ్రీనువైట్ల కసిగా ఉన్నాడు.
వరుణ్ తేజ, శ్రీనువైట్లతో పాటు రచయిత గోపీమోహన్ కు కూడా మిస్టర్ హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, ఇన్నాళ్లూ కోన వెంకట్ తో కలిసి పనిచేసిన ఈ రైటర్.. మిస్టర్ సినిమాకు మాత్రం కోన లేకుండానే వర్క్ చేశాడు. ఈ సినిమా హిట్ అయితే గోపీమోహన్ కు సోలో ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్ తో తను ఎప్పట్నుంచో కలగంటున్న డైరక్షన్ ఛాన్స్ కోసం ప్రయత్నించొచ్చు. వీళ్లతో పాటు నిర్మాతల యాంగిల్ లో కూడా మిస్టర్ మూవీ కచ్చితంగా హిట్ అవ్వాలి.