ప్రజలు బిచ్చగాళ్ళా.?

ప్రాజెక్టులు రాజకీయ నాయకులు వేసే బిచ్చం అయితే.. ప్రజలెవరు.? బిచ్చగాళ్ళే కదా. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, నిన్న కర్నూలు జిల్లాలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య, కాస్తంత ఆవేశానికి లోనయ్యారు. ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసినందుకు చంద్రబాబుకి అభినందనలు తెలుపుతూనే, ఆ ప్రాజెక్టుకి పునాది రాయి వేసింది వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని గుర్తుచేశారు. ఇక్కడిదాకా బాగానే వుంది.. కానీ, ఇదేదో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి భిక్ష.. అంటే దానర్థమేంటి.? ప్రజల్ని బిచ్చగాళ్ళను చేయడమే కదా.! 

చంద్రబాబు అయినా, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అయినా, ఇంకెవరైనా.. ముఖ్యమంత్రులుగా కీలకమైన పదవుల్లో వున్నప్పుడు, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాలి. ముఖ్యమంత్రులెవరూ సొంత ఖర్చులతో ప్రాజెక్టులు చేపట్టలేరు. పైగా, ఆ ప్రాజెక్టుల పేరు చెప్పి కోట్లు వెనకేసుకున్న దాఖలాలు కోకొల్లలు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రాజకీయాలు మాట్లాడనంటూనే, రాజకీయాలే మాట్లాడారు. ఓట్లకోసం బిచ్చమెత్తినంత పన్జేశారక్కడ. 'కర్నూలు జిల్లా నన్ను గెలిపించలేదు, నేను చేయాల్సిన పనిలేదు.. అయినా చేస్తున్నానంటే వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపిస్తారనే..' అంటూ చంద్రబాబు ఓట్లు అడుక్కునే ప్రయత్నం చేశారు. రాజకీయ నాయకుల తీరు అంతే మరి.! 

ఎన్నికల వేళ ప్రజలు తమ డిమాండ్లను రాజకీయ పార్టీల ముందుంచడం సహజం. అది వారి హక్కు. అంతే తప్ప, అడుగుతున్నారని ప్రజల్ని బిచ్చగాళ్ళుగా చూస్తే ఎలా.? నిన్న ర్నూలు జిల్లాలో చంద్రబాబు ప్రసంగం ఆద్యంతం చూస్తే, ఆయనా ప్రజల్ని బిచ్చగాళ్లుగా చూస్తున్నట్లే అన్పించకమానదు. ఏ ప్రాజెక్టులైనాసరే పాలకులు వేసే బిచ్చం కానే కాదు.. అది ప్రజల ఆస్తి, ప్రజల హక్కు. 

Show comments