అతి కిరాతకమైన హత్య.. ఎనీ డౌట్స్‌.?

హత్య అంటే అలాంటిలాంటి హత్య కాదు, అత్యంత కిరాతకమైన హత్య ఇది. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్‌ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై గత శుక్రవారమే ఓటింగ్‌ జరగాల్సి వుంది. కానీ, బీజేపీ నానా గలాటా సృష్టించి, ఓటింగ్‌ జరగకుండా చేసింది. గత ఆగస్ట్‌లో ఈ బిల్లుని రాజ్యసభ పరిగణనలోకి తీసుకుంది. కానీ, అలా పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేని బిల్లు ఇది.. అంటూ చావు కబురు చల్లగా చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ. 

కేవీపీ బిల్లుపై ఓటింగ్‌ జరగడానికి వీల్లేదు.. ఇది మనీ బిల్లు లాంటిది.. అని అరుణ్‌ జైట్లీ చెప్పడం, 'అది నిజమే..' అని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ స్పష్టం చేయడం.. అన్నీ చకచకా జరిగిపోయాయి. పార్లమెంటు సాక్షిగా గతంలో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌పై అత్యాచారం జరిగితే, నేడు హత్య జరిగింది.. అన్న ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతోంది. సోషల్‌ మీడియాలో ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పలువురు నెటిజన్లు పోస్టింగ్స్‌తో విరుచుకుపడ్తున్నారు. 

ఆంద్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు 2014లో ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు రాజ్యసభలో చర్చకు వచ్చి, ఆమోదం పొందిన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రకటించారు. ఆ తర్వాత క్యాబినెట్‌ సమావేశంలోనూ ప్రత్యేక హోదాకి అనుకూలంగా మన్మోహన్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఆ లెక్క, ప్రత్యేక హోదా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కి సంక్రమించిన హక్కు. 

దేవాలయంగా పార్లమెంటుని అభివర్ణించిన నరేంద్రమోడీ, ఆ దేవాలయం సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన ప్రత్యేక హోదా అనే హక్కుని కాల రాసేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? ఆ సంగతి తర్వాత, కాంగ్రెస్‌ పెట్టిన ప్రైవేటు మెంబర్‌ బిల్లుపై దాదాపు ఏడాది గడిచాక, అది ఓటింగ్‌కి పనికిరాని బిల్లు.. అని కేంద్రం చెప్పడం వెనుక అర్థమేంటి.? 

మొత్తమ్మీద, ఇక్కడితో కేవీపీ ప్రైవేటు బిల్లు కథ ముగిసినట్లే. ప్రత్యేక హోదాపై తన పోరాటం కొనసాగుతుందని కేవీపీ చెబుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కాంగ్రెస్‌ చెబుతోంది. ముందు నుంచీ తాము ఇదే మాట చెబుతున్నామనీ, కేవీపీ బిల్లు చెత్తకాగితంతో సమానమన్న తమ మాటే నిజమయ్యిందని టీడీపీ వెటకారాలు చేస్తోంది. రాజ్యసభలోనూ, లోక్‌సభలోనూ ప్రత్యేక హోదా కోసం పోరాటం ఆపేది లేదని వైఎస్సార్సీపీ చెబుతోంది. ఎవరేం చేసినాసరే, ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రం సంకేతాలు పంపుతోంది. 

ఒక్కటి మాత్రం నిజం. కేవీపీ ప్రైవేటు బిల్లుతో ప్రత్యేక హోదా అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. పార్లమెంటు ఇచ్చిన హామీకే దిక్కులేకపోతే, ఇక నరేంద్రమోడీ ప్రభుత్వం దేశాన్ని పరిపాలిస్తోందనుకోవాలా.? ఆ పేరుతో ప్రైవేటు కంపెనీ నడుపుతోందనుకోవాలా.? అన్న చర్చ మొదలయ్యింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెయ్యడానికే నరేంద్రమోడీ ప్రధాని అయ్యారా.? అని ఒక్క ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే కాదు, దేశమంతా ప్రశ్నించేలా ఇప్పుడు రాజ్యసభలో ప్రత్యేక హోదా బిల్లు అంశం రాజకీయ దుమారం రేపింది. మరిప్పుడు, బీజేపీ ఇంకా తప్పించుకోవాలనే చూస్తుందా.? వేచి చూడాల్సిందే.

Show comments