హిందుత్వం పై దాడిని కమలనాథులు పట్టించుకోరే?

సదావర్తి భూముల అక్రమ వేలం గురించి ఇప్పటి వరకూ భారతీయ జనతా పార్టీ కనీస స్పందన కూడా వ్యక్తం చేయడం లేదు. నిబంధనలను పూర్తిగా అతిక్రమించి వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులను కేవలం 22 కోట్ల రూపాయలకు కొల్లగొట్టారు తెలుగుదేశం అనుకూలురు. ఇక్కడ బీజేపీ స్పందన ఎందుకంటే.. ఈ భూములు సత్రం భూములు కాబట్టి. ఇన్ని రోజులూ ఇలాంటి భూముల అమ్మకాలపై బీజేపీ గగ్గోలు పెట్టింది కాబట్టి.. ఈ అంశం గురించి బీజేపీ ఎందుకు స్పందించడం లేదు? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది!

కర్ణాటకలో ఇది వరకూ భారతీయ జనతా పార్టీ వాళ్లు పలుసార్లు గగ్గోలు పెట్టారు. అసెంబ్లీలో ధర్నాకు కూడా దిగారు. హిందూ చారిటబుల్ ట్రస్టుల, సత్రాల, మఠాల భూములను ప్రభుత్వం అన్యక్రాంతం చేస్తోందని కమలనాథులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇలాంటి భూముల అమ్మకం అనేది హిందూమతంపై దాడి అని భారతీయ జనతా పార్టీ వాళ్లు వాదించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట ఈ అంశాల్లో బీజేపీ చాలా ఫీలవుతుంది! 

అయితే.. ఏపీ వేదికగా, తమిళనాడులోని సత్రం భూములను అక్రమంగా దోచి పెట్టిన విధానం గురించి మాత్రం బీజేపీ ఇంతదాకా కిమ్మనడం లేదు. సదావర్తి భూముల వేలం పాట విషయంలో నిబంధనలు అతిక్రమణకు సంబంధించి బొచ్చెడు రుజువులు ఉన్నాయి. కనీసం సరిగా పత్రికా ప్రకటనలు కూడా ఇవ్వకుండానే ఈ భూములను వేలం వేయడం ఒకటైతే, వేలంలో పాల్గొన్న నలుగురూ ఒకే గ్రూపుకు చెందిన వారు కావడం, వారి తరపున ఒకే వ్యక్తి బ్యాంకులో డబ్బును డిపాజిట్ చేయడం ఈ వేలం ప్రక్రియ ఎంత దారుణంగా జరిగిందో అర్థం చేసుకోవడానికి మరో రుజువు!

అన్నిటికన్నా విచిత్రం.. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూములను కేవలం 22 కోట్ల రూపాయలకు ప్రభుత్వం అమ్మేయడం! అది కూడా వేలం పాట పేరుతో హైడ్రామా నడపడం! ఇలాంటి వ్యవహారమే ఏ కాంగ్రెస్ హయాంలోనే జరిగి ఉంటే.. బీజేపీ వాళ్లు మామూలుగా రెచ్చిపోయే వాళ్లు కాదు. హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించి ఆస్తులను ప్రభుత్వం అమ్మడానికి వీల్లేదని సుప్రీం కోర్టు ఇచ్చిన రూలింగును కూడా పట్టించుకోకుండా జరిగిన ఈ వేలం పాట పై బీజేపీ వాళ్లు ఉద్యమాన్నే లేవదీసే వాళ్లు. 

అయితే ఇప్పుడు మాత్రం  కిమ్మనడం లేదు. అది కూడా తాము అధికారంలో భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం ఇంతకు తెగిస్తే.. దేవాధర్మాదాయ శాఖ మంత్రిగా బీజేపీ నేతే ఉన్నా.. ఈ వ్యవహారంపై భారతీయ జనతా పార్టీ స్పందించడం లేదు. బహుశా.. బీజేపీ నేతలకు కూడా ఈ అక్రమాల్లో వాటా ఉందేమో! ఇప్పటికే ఈ భూముల వ్యవహారంలో తెలుగువాడు, చెన్నైతో చాలా అనుబంధం ఉన్నవాడు.. అయిన బీజేపీ జాతీయ ముఖ్యనేతకు వాటా ఉందనే వార్తలు వచ్చాయి. బహుశా.. ఆయనకు ఇబ్బంది కలుగుతుందనే బీజేపీ వీర హిందుత్వ వాదులు మారు మాట్లాడటం లేదేమో! మొత్తానికి బీజేపీ హిందుత్వవాదం చాలా గొప్పదని మరోసారి అర్థం చేసుకోవాలి. 

Show comments