ఆశ - నిరాశల మధ్య ఫిరాయింపుదారులు...!

రాజకీయ నాయకులు తామున్న పార్టీల నుంచి అధికార పార్టీలోకి ఫిరాయించినప్పుడు వారికి ప్రధాన ఆశ, ధ్యాస మంత్రి పదవి. అదీ కుదరకపోతే ఏదో ఒక ప్రాధాన్యమున్న పదవి, అధికారం చెలాయించగలిగే కీలక పోస్టు కోరుకుంటారు. రాబోయే ఎన్నికల్లో టిక్కెట్లు ఆశిస్తారు. ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను చూసి, సంతోషించి తాము పార్టీ మారుతున్నామని, పదవుల కోసం కాదని పైకి చెబుతారు. కాని అసలు నిజం అది కాదని వారితో పాటు జనాలకూ తెలుసు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫిరాయింపుదారుల్లో కీలక నాయకులు, ముఖ్యమంత్రుల నుంచి మంత్రి పదవుల కోసం హామీలు పొందిన నేతలు వాటి కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. 

కాని అనేక కారణాలతో రెండు రాష్ట్రాల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ముందుకు సాగడంలేదు. దీంతో ఫిరాయింపుదారులు ఆశ-నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అనుకున్నది జరగకపోవడంతో పార్టీ మారి తప్పు చేశామా? అని బాధపడుతున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేస్తారని, నలుగురికి మంత్రి పదవులు ఇస్తారని మొన్నీమధ్య వార్తలొచ్చాయి.  వీరిలో ఇద్దరు ఫిరాయింపుదారుల పేర్లు వినిపించాయి. నలుగురిలో ఇద్దరికి పదవులు గ్యారంటీ అని వినిపించింది. 

ఫిరాయింపుదారుల్లో ఒకరు తెలంగాణలో టీడీపీ మునిగిపోవడానికి ప్రధాన కారకుడైన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మరొకరు కాంగ్రెసు నుంచి ఫిరాయించిన నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి. మంత్రి పదవులు వస్తాయని అనుకుంటున్న మరో ఇద్దరు దాస్యం వినయ్‌ భాస్కర్‌(వరంగల్‌ పశ్చిమ), కోవా లక్ష్మి (అసిఫాబాద్‌-ఎస్‌టీ). టీఆర్‌ఎస్‌లో చేరగానే తనకు మంత్రి పదవి వస్తుందని ఎర్రబెల్లి సన్నిహితులతో చెప్పుకున్నారు. మంత్రి పోస్టు అవకాశం లేకపోతే ఏదో ఒక కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి ఇస్తారని చెప్పారట. శాసన మండలి కౌన్సిల్‌ ఛైర్మన్‌గా అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తానన్నారట.  

తనను వాటేసుకొని అక్కున చేర్చుకున్న కేసీఆర్‌ వెంటనే మంత్రి పదవి ఇస్తారని ఎర్రబెల్లి అనుకున్నారు. కాని చాలాకాలం నుంచి ఖాళీగానే ఉంచారు. దీంతో ఆయన కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వినవస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ బిడ్డ కమ్‌ నిజామాబాద్‌ ఎంపీ  కవిత ఓ కబురు చెప్పారు. ఏమిటది? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఇప్పట్లో ఉండదట...! కేసీఆర్‌ పాలన చివరి సంవత్సరంలో ఉండొచ్చన్నారు. అంటే ఎన్నికల ముందన్నమాట. ఈ సమాచారం చెప్పింది కేసీఆర్‌ కుమార్తె కాబట్టి కొంత నిజముందని అనుకోవచ్చు. కేసీఆర్‌ ఆలోచన ఇదే అయితే మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలకు తీవ్ర నిరాశ కలిగినట్లే. ఎన్నికల ముందు పదవులిచ్చినా పనిచేసేది కొద్దికాలం మాత్రమే. 

Readmore!

మంత్రులయ్యారన్న పేరు తప్ప చేసేదేమీ ఉండదు. ఇప్పుడు తెర మీదికి వచ్చిన పేర్లు అప్పుడు వస్తాయనే నమ్మకం లేదు. అప్పుడు సీఎం దృష్టి ఎన్నికల మీదనే ఉంటుంది. కాబట్టి పార్టీని గెలిపించే నాయకుల కోసం చూస్తారు. ఇక ఏపీలోనూ మంత్రి పదవులు ఆశించిన నాయకులు నిరాశ చెందుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏవో కారణాలతో కేబినెట్‌ ప్రక్షాళన వాయిదా వేస్తూ వస్తున్నారు. ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలు జరగాల్సివుంది. కొన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు నిర్వహించాల్సిన ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్నారు.

కేసీఆర్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక ఎన్నికలు జరగడం, గులాబీ పార్టీ ఘన విజయాలు సాధించడం జరిగింది. కాని ఏపీలో బాబు అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు ఎలాంటి ఎన్నికలు జరగలేదు. ఈ ఎన్నికలు జరిగితేగాని టీడీపీకీ ఎంత ఆదరణ ఉందో తెలుస్తుంది. ఓటమి భయంతో మున్సిపల్‌ ఎన్నికలు ప్రభుత్వం వాయిదా వేస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికలు డిసెంబరు లేదా జనవరిలో జరగొచ్చని తెలుస్తోంది. ఈ ఎన్నికలకు ముందే మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేస్తారని ఒకసారి, ఎన్నికల తరువాత చేస్తారని మరోసారి వార్తలొస్తున్నాయి. ఫిరాయింపుదారుల్లో నలుగురైదుగురు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకొని ఉన్నారు. 

ఫిరాయింపు సమయంలో బాబు హామీ ఇవ్వడమే ఇందుకు కారణం. ఇక ఏపీ ఫిరాయింపుదారుల్లోనూ కొందరు తీవ్ర అసంతృప్తి చెందుతున్నట్లు వార్తలొస్తున్నాయి. మంత్రి పదవులు ఆలస్యమవుతున్నాయని కొందరు, తగిన గౌరవం దక్కడంలేదని కొందరు, జిల్లాల్లోని రాజకీయాల కారణంగా మరికొందరు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేల్లో ఆరుగురు తిరిగి సొంత పార్టీకి వెళ్లాలనుకుంటున్నట్లు కొంతకాలం క్రితం ఓ ఆంగ్ల పత్రిక రాసింది. మొత్తం మీద పిరాయింపుదారుల్లో 'జంపింగ్‌' సమయంలో ఉన్నప్పటి ఉత్సాహం ఇప్పుడు లేనట్లు తెలుస్తోంది. 

Show comments