బాబు గారు.. రైతులంటే మీకెందుకీ కసి?

ఇప్పటికే రుణమాఫీ హామీతో రైతాంగాన్ని దారుణంగా దెబ్బతీశాడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. మాఫీ రూపంలో చేసిన పచ్చి మోసం విషయంలో రైతులు ఆయనపై  తీవ్రమైన ఆగ్రహావేశాలతో ఉన్నారు.

మరి అదే అనుకుంటే..  ఏపీ సీఎం బ్యాంకర్లకు ఇచ్చిన ఒక ఉచిత సలహాతో రైతులపై ఆయనకు ఉన్న విజనేమిటో అర్థం అవుతోంది. భార్య మెడల్లోని పుస్తెలను తాకట్టు పెట్టి.. బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకునే రైతుల మీద బాబు అక్కసు వెల్లగక్కారు. ఈ విషయంలో వ్యాపారం చేసే బ్యాంకులకు కూడా లేని బాధ ఏపీ ముఖ్యమంత్రికి ఉండటం విషాదకరం.

సాధారణంగా రైతుల బంగారాన్ని కుదవపెట్టి తెచ్చుకునే అప్పులను వ్యవసాయ రుణాలుగానే చూస్తాయి బ్యాంకులు. తొలి ఏడాది వరకూ వీటిపై రూపాయి వరకూ వడ్డీ తీసుకుంటూ.. కుదవ పెట్టిన బంగారం విలువను బట్టి అప్పును ఇస్తాయి. తమకు డబ్బులు అవసరం అయినప్పుడు రైతులు ఈ విధంగా అప్పులు తెచ్చుకోవడం చాలా సహజమే. మరి ఆ డబ్బును వ్యవసాయంపై పెట్టుబడి కే ఉపయోగిస్తారా లేక.. పిల్లల చదువుల కోసమో, మరో సమస్య కోసం వినియోగించుకుంటారా అనేది తర్వాతి ప్రశ్న.

వ్యవసాయం మీద ఆధారపడి బతికే వాళ్లు కాబట్టి.. బ్యాంకులు కూడా రైతులకు బంగారం లోన్ల ను ఎప్పుడిచ్చినా వాటిని వ్యవసాయం కోసం తీసుకున్న అప్పులుగానే పరిగణిస్తాయి. ఈ విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఇదేతీరున నడుచుకుంటున్నాయి. మరి మధ్యలో చంద్రబాబు నాయుడికి వచ్చిన నొప్పి ఏమిటో అర్థం కాని పరిస్థితి. 

బంగారం విలువను బట్టి కాకుండా.. పంటకు అయ్యే ఖర్చును లెక్కించి, రైతు స్థాయిని బట్టి అప్పులు ఇవ్వాలని ఈయన గారు సూచిస్తున్నారు. మరీ ఇంత దుర్మార్గమా? అప్పులు ఇస్తున్నది బ్యాంకులు, తీసుకుంటున్నది రైతులు.. మధ్యలో ఈ సంస్కర్త సూచనలు ఎందుకు? రుణాలు మాఫీ చేస్తానని మోసం చేసిన వ్యక్తి మళ్లీ ఇలా మాట్లాడటమా?

అలాకాదు.. మా  బాబుగారు పెద్ద ఆర్థిక సంస్కరణ వాది, అందుకే రైతులు ఎలా నాశనం అయినా అయిపోనీ, బ్యాంకుల కోసం ఇలాంటి సలహా ఇస్తున్నాడని అంటారా? బాబుగారి సంస్కరణలు ఏమిటో అర్థం అవుతూనే ఉన్నాయి. చంద్రన్న కానుకలు అంటూ వేల కోట్లు పెట్టి పప్పు బెల్లాలు పంచి పెట్టడం, పుష్కరాలు అంటూ మరికొన్ని వేల కోట్లు నీళ్ల పాలు చేయడం.. ప్రత్యేక విమానాల్లో విహారాలు చేయడం.. ఇవీ చంద్రన్న మార్కు ఆర్థిక సంస్కరణలు.

ప్రజల సొమ్మును ఇలా విచ్చల విడిగా చేసే వ్యక్తికి నిజంగానే బ్యాంకులకు ఇలాంటి సలహా ఇచ్చే అర్హత ఉంటుందా?  వ్యవసాయ దారులపై మదిలో ఉన్న అక్కసు కాకపోతే ఈ మాటలేమిటి? 

Show comments