ఏం ఆశపెడితే భూమా ఫిరాయించారు?

రాజకీయ నాయకులు తాము రాజకీయాలు చేయడంలేదంటూనే రాజకీయాలు చేస్తుంటారు. ఇదే వీరి ప్రత్యేకత. వీరు చేసే రాజకీయాలు అనేక రకాలుగా ఉంటాయి. వాటిల్లో ఒక రకం 'శవ రాజకీయం'. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లా నాయకుడు భూమా నాగిరెడ్డి మరణంపై శవ రాజకీయం జోరుగా సాగుతున్న తీరు చూస్తున్నాం. సహజంగానే టీడీపీ, వైకాపాలు శవ రాజకీయాలు చేసేది మీరంటే మీరని దూషించుకుంటున్నాయి. హరి కథలు చెప్పే హరిదాసులు మధ్య మధ్య పిట్ట కథలు చెప్పే తీరుగా కొందరు నాయకులు ఈ శవ రాజకీయంలో పిట్ట కథలు చెబుతున్నారు. టీడీపీ నాయకులు చెప్పే పిట్ట కథల వెనక నిజానిజాలేమిటో అధినేత వివరించాలి. భూమా నాగిరెడ్డి ఎందుకు హఠాత్తుగా మరణించారు? తీవ్రమైన గుండెపోటు కారణంగా. అంత తీవ్రంగా గుండెపోటు ఎందుకు వచ్చింది? ఆయన మానసికంగా బాధపడుతున్నారు. ఎందుకు మానసిక బాధ? ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదని? చంద్రబాబు ఎందుకన్నారు? భూమా వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించినప్పుడు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఎంతకాలం ఎదురుచూసినా ఆ కోరిక నెరవేరలేదు కాబట్టి మానసికంగా కుంగిపోయారు. అంటే భూమా చనిపోవడానికి కారణం చంద్రబాబు అనేది వైకాపా నాయకుల ఆరోపణ. 

పార్టీ ఫిరాయించిన మూడు రోజుల్లోగా మంత్రి పదవి ఇస్తానని చెప్పారట. కాని ఏడాదైనా ఇవ్వలేదు. ఇది అబద్ధమో, నిజమోగాని చంద్రబాబు వ్యవహార శైలికి తగినట్లుగా వైకాపా నాయకులు చెప్పారు. మంత్రి పదవి ఇవ్వలేదనే బాధతో పోయాడో లేడో ఎవ్వరూ చెప్పలేరు. కూతరు అఖిలప్రియతోగాని, సన్నిహితుల దగ్గరగాని ఆయన ఈ విషయంపై చర్చించినట్లు మీడియా కథనాల్లో లేదు. టీడీపీ అనుకూల పత్రిక 'నేను శోభ దగ్గరకు వెళ్లిపోతాను' అని నాగిరెడ్డి తన కుమార్తెతో చాలాసార్లు అన్నట్లు రాసింది. భార్య లేని లోటు ఆయన్ని మానసికంగా కుంగదీసిందనేది దీని సారాంశం. వైకాపా నాయకులు మాత్రం  పదవి ఇవ్వలేదనే కారణంతో పోయారని అంటున్నారు. దీంతో చంద్రబాబుకు చెడ్డపేరు వస్తుందని ఫీలైన టీడీపీ ఎమ్మెల్యే  కూన రవికుమార్‌ 'భూమాకు మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు ఏనాడూ చెప్పలేదు' అని అన్నారు. అంటే ఏ పదవీ ఆశించకుండానే భూమా టీడీపీలోకి వచ్చారన్న మాట.

మంత్రి పదవులో, ఇంకోలాంటి పదవులో ఆశ పడకుండా ఏ నాయకుడైనా ప్రతిపక్షంలోంచి అధికార పక్షంలోకి వస్తాడా? కొన్ని రోజుల హైడ్రామా తరువాతనే భూమా తన కుమార్తెతో కలిసి టీడీపీలో చేరారు. ఏమీ ఆశించకుండా చేరితే ఇంత డ్రామా అవసరం ఉండదు. పదవి ఆశించని వాడైతే ప్రతిపక్షంలో ఉంటే మాత్రమేమిటి? ఎన్టీఆర్‌ టీడీపీ పెట్టినప్పుడు చంద్రబాబు కాంగ్రెసు నుంచి ఎందుకు వచ్చారు? ఏదో ఆశించే కదా. భూమాకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారా? లేదా? అనే విషయంలో చంద్రబాబు నిజం చెప్పాల్సిన అవసరముంది. వైకాపా, కాంగ్రెసు నుంచి ఫిరాయించిన వారిలో కీలక నాయకులకు మంత్రి పదవులు ఇస్తానని బాబు హామీ ఇచ్చారు. వారంతా అందుకోసం కాచుకు కూర్చున్నారు. భూమా చనిపోగానే మీడియాలో వచ్చిన కథనాల్లో మంత్రి పదవిపై ప్రస్తావన ప్రముఖంగా ఉంది. వాస్తవానికి మంత్రి కావాలనేది ఆయనకు ఎప్పటినుంచో ఉన్న కోరిక.

రాయలసీమలో బలమైన నాయకుడికి ఈ కోరిక ఉండటం అసహజం కాదు. కాని ఆయన మూడుసార్లు ఎంపీగా ఉండటం, ఇతర కారణాలరీత్యా రాష్ట్రంలో మంత్రి కాలేకపోయారు. భార్య శోభా నాగిరెడ్డిని మంత్రిని చేయలేని చంద్రబాబు ఆమెకు ఎపిఎస్‌ఆర్టీసీ ఛైర్‌పర్సన్‌ పదవి ఇచ్చారు. వైకాపా నుంచి టీడీపీలో చేరగానే తాను రాజీనామా చేసి మళ్లీ టీడీపీ టిక్కెట్‌పై పోటీ చేస్తానని చంద్రబాబుకు భూమా చెప్పారట. రాజీనామా చేయకుండా పార్టీలో ఉండటం నైతికంగా తప్పని అన్నారట. కాని చంద్రబాబు అంగీకరించలేదు. ఒక్కరు రాజీనామా చేస్తే మిగిలిన ఫిరాయింపుదారులూ అదే బాటలో నడవాల్సివస్తుంది. వారిలో ఎంతమంది గెలుస్తారో తెలియదు. దీంతో ఎమ్మెల్యేలే ముఖ్యంగాని నైతిక విలువలు ఎందుకనుకున్న బాబు రాజీనామాల ఊసెత్తలేదు. భూమా నైతికంగా, సాంకేతికంగా టీడీపీ ఎమ్మెల్యే కాకపోయినా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించడం రాజకీయ ప్రయోజనాల కోసమే. భూమా చనిపోయిన రెండోరోజు నుంచే రాజకీయాలు చేస్తున్న రెండు పార్టీల నాయకులు అప్పుడే నంద్యాల ఉప ఎన్నికపై కూడా రచ్చ చేయడం ప్రారంభించారు.

Show comments