నరేంద్రమోడీ దేశభక్తికి అగ్ని పరీక్ష.!

భారతీయ జనతా పార్టీ నేతలు దేశభక్తికి తామే బ్రాండ్‌ అంబాసిడర్లమని చెప్పుకుంటుంటారు. తమ నరనరాల్లో దేశభక్తి ప్రవహిస్తోందంటారు. మాటలకేం, ఎన్నయినా చెప్పొచ్చు. చేతల్లోనే కదా.. అసలు విషయం బయటపడేది.! 

జమ్మూకాశ్మీర్‌లో బీజేపీ - జెకెపిడిపి పార్టీలు సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. పిడిపి తరఫున ముఖ్యమంత్రి, బిజెపి తరఫున ఉప ముఖ్యమంత్రి.. ఇలా అధికారం పంచుకున్నాయి ఆ రెండు పార్టీలూ జమ్మూ కాశ్మీర్‌లో. అలా బీజేపీ - పీడీపీ ప్రభుత్వం జమ్మూకాశ్మీర్‌లో పాలన కొనసాగిస్తోన్న విషయం విదితమే. ఈ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. 

భారత్‌పై యుద్ధంలో భాగంగా పాకిస్తాన్‌ పెంచిపోషిస్తోన్న తీవ్రవాదులతో చేతులు కలిపిన బుర్హాన్‌ వనీ, ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడం, ఆ తర్వాత కాశ్మీర్‌ అల్ల కల్లోలమవడం తెల్సిన విషయమే. ఆ తీవ్రవాది బుర్హాన్‌ వనీ కుటుంబానికి జమ్మూ కాశ్మీర్‌ ప్రభుత్వం 4 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాని ప్రకటించింది. ఓ తీవ్రవాది చనిపోతే, అతని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం దేశచరిత్రలో ఇదే ప్రథమం అని చెప్పుకోవాలేమో. 

ఈ నిర్ణయాన్ని బీజేపీ సమర్థిస్తుందా.? వ్యతిరేకిస్తుందా.? అన్న చర్చ అనవసరం. సమర్థించబట్టే, అంత ధైర్యంగా ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ, తీవ్రవాది కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇంకెందుకు, జమ్మూకాశ్మీర్‌లో సైన్యం - తీవ్రవాదులతో పోరాడాలి.? అన్న ప్రశ్న ఉత్పన్నమవడం సహజమే. భారత సైన్యాన్ని చంపుతోన్న తీవ్రవాదులకి పాకిస్తాన్‌ ఆర్థిక సహాయం చేస్తోంది.. అందుకని, పాకిస్తాన్‌ని తీవ్రవాద దేశం అంటున్నాం. మరి, జమ్మూకాశ్మీర్‌లో పీడీపీ - బీజేపీ ప్రభుత్వం చేస్తున్నదేంటి.? 

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, ఇప్పుడీ విషయంపై సమాధానం చెప్పి తీరాలి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పీడీపీతో తమ పార్టీ 'స్నేహం'పై పెదవి విప్పాలి. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, బీజేపీ దేశభక్తికి ఇది అగ్ని పరీక్ష లాంటిదే. బుకాయిస్తుందా.? సమర్థిస్తుందా.? స్నేహాన్ని తెగతెంపులు చేసుకుంటుందా.? బీజేపీ నెక్స్‌ట్‌ స్టెప్‌ ఏంటో వేచి చూడాల్సిందే.

Show comments