పాపం..భాజపా కాపులు?

భాజపాలో కాపు నేతలకు రోజులు కావన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.  వెంకయ్య హయాం సాగినంత కాలం, కేవలం ఏదో అలా తమ చిన్నా చితకా పనులు చేయించుకోవడానికి తప్ప, మరెందుకు భాజపాలో వుండనక్కరలేదని టాక్ వినిపిస్తోంది. పార్టీ పదవులో ఇంకొకటో వరిస్తాయని ఆశించనక్కరలేదని, వెంకయ్య కీలక పదవులు వేటినీ కమ్మ సామాజిక వర్గాన్ని దాటి పోనివ్వరని భాజపా కాపునేతలు ఓ డెసిషన్ కు వచ్చేసారట. 

అందుకే ఓన్లీ వన్ ఆల్టర్నేటివ్ అయిన వైకాపా వైపు వీరు చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైకాపాలో వున్న సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణతో భాజపా కాపు నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇంకా ఒకరిద్దరు సమాలోచనలు జరుపుతున్నారు. అయితే వీరు అంత వేగంగా వైకాపాలోకి జంప్ చేసేంత సీన్ కనిపించడం లేదు. దానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి భాజపా జనాలను వైకాపాలోకి తీసుకోవడానికి జగన్ అంత ఆతృతగా లేరని వినికిడి. 

ఇలాంటి చర్యల ద్వారా అమిత్ షా, మోడీ వంటి వారి ఆగ్రహానికి గురి కావాలని జగన్ అనుకోవడం లేదు. అదే సమయంలో ఇప్పటికిప్పుడు వైకాపాలోకి వెళ్లి ఆంధ్రలో కానిస్టేబుల్ కూడా మాట వినకుండా చేసుకోవాలని కాపు నాయకులు కూడా అనుకోవడం లేదు. అయితే తమ అసంతృప్తిని ఏదో విధంగా బయటకు వార్తలుగా పంపే  పనిలో మాత్రం వున్నారు. అదే సమయంలో స్టేట్ లో తెలుగుదేశం వ్యవహారాలు, ఆ పార్టీ నాయకులు భాజపా వ్యతిరేక ప్రకటనలు ఇలాంటివి అన్నీ ఎప్పటికప్పుడు కేంద్ర పార్టీకి పంపించడం, తద్వారా వెంకయ్యను ఇరుకున పెట్టడం వంటి పనులు సైలెంట్ గా జరుగుతున్నట్లు వినికిడి. 

తెలుగుదేశంతో  భాజపా సంబంధాలకు ఢిల్లీ స్థాయిలో పెద్దకాపుగా వెంకయ్య నాయుడు వున్నారు. ఢిల్లీ స్థాయిలో ఆయన చుట్టూ వున్నవారిలో ఆయన సామాజిక వర్గం జనాలే ఎక్కువని రాజకీయ వర్గాల బోగట్టా. ఈ విషయాన్ని కూడా రాష్ట్ర భాజపా కాపు నేతలు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారని, ఇలా భాజపాలో కిందా మీదా పడుతూ వచ్చే ఎన్నికల వరకు వుండాలన్నది వారి ఆలోచనగా తెలుస్తోంది. 

ఎన్నికల సమయంలో తెలుగుదేశంతో పొత్తు, టికెట్ ల కోసం కమ్మసామాజిక వర్గంతో పోటీ లాంటివి అన్నీ కలిసి తమకు ఎలాగూ అవకాశాలు రానివ్వవని కాపు నాయకులకు తెలుసు. అందుకే అప్పుడే, ఆ వైఖరిని క్లియర్ గా చూసిన తరువాత, అది చూపించిన తరువాతే గుడ్ బై చెబితే బెటర్ గా వుంటుందని అనుకుంటున్నారట. అయితే అంతవరకు వైకాపా దగ్గర రుమాళ్లు మాత్రం వేసి వుంచుతారని తెలుస్తోంది.

Show comments