రాజకీయాల్లో కొనసాగాలా.? సినిమాలకే పరిమితమవ్వాలా.? ఈ ప్రశ్నల చుట్టూ మెగాస్టార్ చిరంజీవి గిర్రున తిరగాల్సి వస్తోంది. రాజకీయాల్లోంచి కాస్త విరామం తీసుకుని, సినిమాల్లో నటిద్దామనుకున్నా.. కాంగ్రెస్ అధికారంలో వున్నన్నాళ్ళూ సాహసించలేకపోయారు చిరంజీవి. కేంద్ర మంత్రిగా పదవిలో వుంటూ, సినిమాల్లో నటించడం కష్టమనుకున్నారు. ఆ మాటకొస్తే, 2009 ఎన్నికలకు ముందు పార్టీ పెట్టినప్పటినుంచి, సినీ రంగంలోకి రీ-ఎంట్రీపై చిరంజీవి స్ట్రగుల్ అవుతూనే వచ్చారు.
కాలం గిర్రున తిరిగేసింది. ఎనిమిదేళ్ళ గ్యాప్ తర్వాత తెరపై రీ-ఎంట్రీ ఇస్తున్నారు చిరంజీవి. ప్రస్తుతానికి చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న విషయం విదితమే. కాంగ్రెస్‌లో వున్నా, ఆయన ఆ పార్టీలో లేనట్లే. ఎందుకంటే, చిరంజీవి గత కొన్నాళ్లుగా పొలిటికల్ తెరపై కన్పించడంలేదు. కీలకమైన ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో ఆంద్రప్రదేశ్ తరఫున చిరంజీవి పెదవి విప్పలేకపోయారు. అంతకు మించిన ముఖ్యమైన అంశం ఇంకోటి చిరంజీవి మాట్లాడేందుకు వుంటుందని అనుకోలేం.
ఇక, సినిమాల్లో కొనసాగడంపైనా చిరంజీవిలో సస్పెన్స్ లేకపోలేదు. 'ఖైదీ నెంబర్ 150' సినిమా రిజల్ట్ తర్వాత చిరంజీవి మరోమారు సినిమా - రాజకీయం అనే అంశాలపై ఇంకోసారి పునరాలోచనలో పడాల్సి వుంటుంది. ఆ సినిమా ఫలితాన్ని బట్టే, చిరంజీవి సినిమాల్లో కొనసాగాలా.? రాజకీయాల్లో కొనసాగాలా.? అనేదానిపై ఓ నిర్ణయానికి వస్తారేమో. ప్రస్తుతానికి చిరంజీవి సినిమా రంగంలో కంఫర్ట్‌గా వున్నారని అప్పుడే మెగా కాంపౌండ్ నుంచి ఫీలర్స్ అందుతున్నాయి. ఇంకోపక్క, చిరంజీవి కాంగ్రెస్‌లోనే వుంటారంటూ ఆయనకు అత్యంత సన్నిహితుడైన రామచంద్రయ్య చెబుతున్నారు.
ఏమో, ఏది నిజమవుతుందోగానీ.. 'ఖైదీ' సినిమా విడుదల చిరంజీవికీ, ఆయన అభిమానులకీ వున్న కన్‌ఫ్యూజన్‌పై చాలావరకు క్లారిటీ ఇవ్వనుండడమైతే ఖాయమే.