జేసీతో తల గోక్కోవడం అంటే అర్థం అయినట్టే..!

మామూలుగా కాదు.. నిలువునా తీస్తున్నాడు తెలుగుదేశం పార్టీ పరువును. ఆఖరికి సీఎం మీటింగ్‌లో కూడా దివాకర్ రెడ్డి ఏం మాట్లాడతాడో.. అని తెలుగుదేశం శ్రేణులు భయం భయంగా గడిపాయి. జేసీ చేతుల నుంచి మైక్‌ను లాగేసుకునేంత వరకూ కూడా ఆ రోజు తెలుగుదేశం ముఖ్య నేతల్లో భయం ప్రస్ఫూటమైంది. ఆ రోజుకు అలా గడిచిపోయినా.. ఆ వెంటనే తెలుగుదేశం పాలనలో కుల పిచ్చి తీవ్ర స్థాయికి చేరిందన్న వ్యాఖ్యానాలతో జేసీ ఒకింత సంచలనమే సష్టించాడు. అలా ఇలా కాకుండా.. తెలుగుదేశం కుంభస్థలం మీదే కొట్టాడు ఆ పార్టీ కే  చెందిన ఈ ఎంపీ!

ఇప్పటికే చెప్పేశాడు.. వచ్చే ఎన్నికల్లో తను పోటీ చేయను అని... ఇక మొహమాటాలేమీ లేవు, ఎక్కడిక్కడ కడిగేస్తున్నాడు! ఒకవేళ ఏ ప్రతిపక్షంలోనో ఉండి... ఇలా మాట్లాడుతూ ఉండుంటే అదో లెక్క. కానీ పసుపు పార్టీ ఎంపీగానే ఉండి.. ఆ పార్టీ రాజకీయాల గురించి ఇలా మాట్లాడుతుండటం మాత్రం రంజుగా మారింది.

అసలు జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశంలో చేరడమే నిస్సందేహంగా పెద్ద పొరపాటు. అందుకు పరిహారం జేసీ చెల్లించుకోవడం లేదు.. తెలుగుదేశం పార్టీ చెల్లిస్తోంది! అదీ ఇక్కడ ప్రత్యేకత. అప్పుడే అయిపోలేదు... ఇప్పుడు సూటిగా తెలుగుదేశం పార్టీ కులపిచ్చి గురించి సూటిగా, స్పష్టంగా మాట్లాడేంత వరకూ వచ్చాడు జేసీ. మరి ఇంకా ఉన్న రెండున్నరేళ్ల సమయంలో ఆ పార్టీ తీరు గురించి ఎలాంటెలాంటి వ్యాఖ్యానాలు చేస్తాడో.. అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.

ఇటీవల చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు.. అక్కడ జరిపిన సభ లాంటి సమావేశానికి దివాకర్ రెడ్డి కూడా హాజరయ్యాడు. అధికార పార్టీ నేతలంతా.. బాబుగారిని ఆ సభలో వేనోళ్ల పొగిడేశారు. వీరుడు.. శూరుడు.. కరువును తరిమి కొట్టాడు.. అంటూ మరొకరికి ఛాన్సు దక్కనీయకూడదన్నట్టుగా ఎవరికి వారు భజన చేశారు. వీళ్ల భజనంతా ఒక ఎత్తు అయితే... జేసీ చేతిలో మైకు ఉన్నంత సేపూ తెలుగుదేశం నేతల గుండె దడ మరో ఎత్తు!

జేసీతో అంతో ఇంతో సాన్నిహిత్యం ఉన్న పయ్యావుల కేశవ్, పల్లె రఘునాథరెడ్డిలు... ‘‘అన్నా.. మైకు..’’ అంటూ దగ్గరకు వెళ్లి బతిమాలుకోవడం కనిపించింది. కరువు పరిస్థితిని మీడియా ముందు కవరేజీ చేయడానికి అన్నట్టుగా తాము భజన చేస్తుంటే... జేసీ ఏదైనా ఒక్కమాట మాట్లాడినా మొత్తం వ్యవహారం కంపు కంపు అయిపోతుందనే భయం వారిది. చివరకు జేసీ చేతి నుంచి మైకు లాగేసుకుని.. రిలీఫ్‌గా ఫీలయ్యారు తెలుగుదేశం నేతలు.

ఆ వెంటనే... అనంతపురం మేయర్, అనంతపురం ఎమ్మెల్యే ట్రూపు గురించి ‘‘కుల పిచ్చి’’ వ్యాఖ్యానాలు చేశాడు దివాకర్ రెడ్డి. ఆయన ఇంతటితో ఆగుతాడనే నమ్మకం ఏ మాత్రం లేదు. భజన బ్యాచ్‌లో కలిసిపోతే జనాలు కూడా పట్టించుకోరు, వాస్తవాలు మాట్లాడుతుంటే కనీసం ఆ రకమైన గుర్తింపు అయినా వస్తుందనే భావనతో ఉన్నట్టున్నాడు దివాకర్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ఈ ఎంపీ టికెట్‌ను తన కుటుంబానికి ఇస్తుందా.. ఇవ్వదా.. అనేది జేసీకి సమస్యే కాదు! కాబట్టి... జేసీతో తల గోక్కుంటుంటే.. ఎంత సమ్మగా ఉంటుందో.. తెలుగుదేశం పార్టీకి ముందు ముందు పరిపూర్ణంగా అర్థం అవుతుంది!

Show comments