పాలకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఏదో చేస్తారు. ఆ పని వల్ల ప్రజలు తమను బ్రహ్మాండంగా ఆదరిస్తారని అనుకుంటారు. కాని అనుకోకుండా సీన్ రివర్స్ అయితే ఈ పని ఎందుకు చేశామురా అనుకొని తల పట్టుకుంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, దాని అధినేత చంద్రబాబు నాయుడి పరిస్థితి రివర్స్ గేర్‌లో ఉంది. ఇంతకూ ఏం జరిగింది? నోట్ల రద్దుతో గత పదమూడు రోజులుగా ఇబ్బందులు పడుతున్న జనం బీజేపీ మీద, మోదీ మీద తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. టీడీపీ-బీజేపీ దోస్తులు కదా.
దీంతో ఆ ఆగ్రహంలో కొంత టీడీపీ, చంద్రబాబు మీదికి మళ్లుతోంది. ఎందుకు? పెద్ద నోట్ల రద్దుకు చంద్రబాబు నాయుడు వెంటనే మద్దతు ప్రకటించారు కదా. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధు విజయంలో వాటా దక్కించుకోవాలని తాపత్రయపడిన చంద్రబాబు నోట్ల రద్దు వంటి సంచలన నిర్ణయంలో, నల్ల కుబేరుల పీచమణిచే మంచి పనిలో తనకూ వాటా ఉందని చెప్పుకోవడానికి వెనకాడరు కదా. ఆయన ఆ పనే చేశారు. మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించగానే చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు మోదీతో దోస్తీ ఓ కారణమైతే, నోట్ల రద్దు కారణంగా ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బతుకు బస్టాండు అవుతుందనే ఆనందం మరో కారణం.
పెద్ద నోట్ల రద్దు కోసం తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటినుంచే పోరాడుతున్నానని, మోదీ అధికారంలోకి వచ్చాక దీనిపై లేఖలు రాశానని చెప్పుకున్నారు. నల్ల ధనం లేకుండా చేయడంలో తాను కూడా ప్రధాన పాత్ర పోషించానని ప్రచారం చేసుకున్నారు. యథా ప్రకారం 'పచ్చ' తమ్ముళ్లు అధినేతను ఆకాశానికి ఎత్తేశారు. మోదీతో సమానమైన క్రెడిట్ ఇచ్చారు. కాని రోజురోజుకు ప్రజల కష్టాలు పెరుగుతుండటంతో కథ తిరగబడుతోందని గ్రహించి నోట్ల రద్దుపై ప్రచారం తగ్గించారు. మోదీపై ప్రజాగ్రహం పెరిగిపోవడానికి తోడు ప్రతిపక్షాల నిరసనలు, వ్యతిరేక ప్రచారం ఎక్కువయ్యాయి.
ఈ నేపథ్యంలోనే టీడీపీ ప్రధాన కార్యదర్శి కమ్ బాబు కుమారుడు లోకేష్ టీడీపీ నాయకులకు అల్టిమేటం వంటిది జారీ చేశారు. ఏమిటది? ఈ నెలాఖరు (నవంబరు) లోగా టీడీపీ సభ్యత్వం లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితిలోనూ ఇది జరిగి తీరాలన్నారు. టీడీపీ సభ్యత్వం వంద రూపాయలు. సాధారణ పరిస్థితిలో సభ్యత్వ లక్ష్యం పూర్తి చేసేవారేమో. కాని డబ్బుకు కటకటలాడుతున్న నేపథ్యంలో వంద రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకోవాడానికి జనం సుముఖంగా లేరు. వంద రూపాయల కాగితం ఇప్పుడు అపురూపంగా ఉంది. ఇదొక్కటే కాకుండా ముందు జాగ్రత చర్యలు తీసుకోకుండా మోదీ సర్కారు జనాన్ని ఇబ్బంది పెడుతోంది.
ఈ సమయంలో వారి దగ్గరకు వెళ్లి టీడీపీ సభ్యత్వం తీసుకోవాలని అడిగితే కొట్టేటట్లున్నారు. నాయకులు ఇదే విషయం లోకేష్‌కు చెప్పారు. గడువులోగా సభ్యత్వ లక్ష్యం పూర్తి చేయడం సాధ్యంకాదని తేల్చిచెప్పారట. ప్రజలు ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో వారిని సభ్యులుగా చేరండని అడగడం భావ్యం కాదని చెప్పారు. ఈ సమయంలో లోకేష్ మాత్రం చేసేది ఏముంది? గడువు పొడిగిస్తామన్నాడట. ఇదిలా ఉంటే...ప్రత్యేక హోదా వదులుకున్నందుకు జనం బాబుపై ఆగ్రహంగా ఉన్నారు. ఒకప్పుడు హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నది ఆయనే, ఆ తరువాత హోదాతో ఒరిగేదేమీ లేదన్నదీ ఆయనే. దీంతో జనం బాబుపై వ్యతిరేకంగా ఉన్నారనేది వాస్తవం.
ఇప్పుడు నోట్ల రద్దును బాబు సమర్ధించడంతో ఆర్థిక సంక్షోభానికి ఆయన కూడా కారకుడనే భావన ప్రజల్లో ఏర్పడింది. ప్రజల కష్టాలు చూశాక మోదీ అనాలోచితంగా వ్యవహరించారని బాబు పరోక్షంగా విమర్శిస్తున్నారు. ఆర్ధిక సంక్షోభంపై ముఖ్యమంత్రి అసహనంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. రాష్ట్రంలో త్వరలోనే జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో నోట్ల రద్దు సంక్షోభం కూడా ప్రభావం చూపుతుందని అనుకుంటున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన బీజేపీపై ప్రజలకు పీకల వరకు కోపం ఉంది. నోట్ల రద్దు సంక్షోభం ఇప్పుడు దానికి తోడైంది. సో...రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు ఉండదనే భావించాల్సివస్తోంది. కమలం పార్టీతో అంటకాగినందుకు 'పచ్చ' పార్టీ కూడా మూల్యం చెల్లించాల్సి రావొచ్చు.