పవన్‌కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నుంచి కార్యకలాపాలు మొదలవుతున్నాయి. ఇప్పటికే పవన్‌కళ్యాణ్ మూడు బహిరంగ సభలు నిర్వహించిన విషయం విదితమే. అయితే, పవన్‌కళ్యాణ్ తప్ప, జనసేన పార్టీ నుంచి అధికారికంగా ఇంకో వ్యక్తి నిన్న మొన్నటిదాకా కన్పించలేదు. ఇటీవలే, జనసేన పార్టీ తరఫున మీడియా వ్యవహారాలు చూసుకునే వ్యక్తి అనీ, తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ అనీ పవన్‌కళ్యాణ్, కొందర్ని నియమించిన విషయం విదితమే.
అయినాసరే, రాజకీయ పార్టీ అన్నాక జనంలో వుండాలి. పార్టీ తరఫున నాయకులు కన్పించాలి. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలి. అవేవీ లేకుండా, జనసేన కార్యకర్తలమంటూ పవన్‌కళ్యాణ్ అభిమానులు హంగామా చేస్తే సరిపోదు. ఇప్పటికీ అభిమానులే, జనసేన పార్టీ ప్రతినిథులుగా చెలామణీ అవుతున్నారు. హైద్రాబాద్‌లోని నిమ్స్‌లో రోగుల వద్ద నుంచి పాత నోట్లు తీసుకుని, కొత్త నోట్లను వారికి అందించి, నోట్ల కష్టాల్ని తమ చర్యలతో చెప్పకనే చెప్పారు.
ఇక, తాజాగా మీడియాలోనూ జనసేన ప్రతినిథులు కన్పిస్తున్నారు. చర్చా కార్యక్రమాల్లో అడపా దడపా జనసేన పార్టీ ప్రతినిథులు కన్పిస్తూ, పార్టీ వాయిస్‌ని విన్పించేందుకు ప్రయత్నిస్తుండడం గమనార్హం. 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన పవన్‌కళ్యాణ్, ఆ దిశగా పార్టీని బలోపేతం చేయడంలో మాత్రం 'వేగం' ప్రదర్శించకపోవడం ఆశ్చర్యకరం. పార్టీని మాత్రం అభిమానులు తమ భుజానికెత్తుకుని మోస్తూనే వున్నారు.
అభిమానులు ఏం చేసినా, అది సినిమా'ట్రిక్స్'లానే మిగిలిపోతాయి తప్ప పొలిటికల్ భావజాల వ్యాప్తికి పనికిరావన్నది నిర్వివాదాంశం. అయితే, సంక్రాంతి తర్వాత పార్టీ కార్యకలాపాలు ఊపందుకుంటాయని జనసేన ప్రతినిథులు అంటున్నారు. నిజమేనా.? ఈ ప్రశ్నకు సమాధానం జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్ చెప్పాల్సి వుంటుంది.