చంద్రబాబు ఇప్పుడు హ్యాపీనా.?

కృష్ణా పుష్కరాల్లో చంద్రబాబుకి ఊరట. చేసిన ఏర్పాట్లు వృధా కాలేదు. పుష్కరాలకు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పుష్కరాల కోసం చేసిన ఏర్పాట్లకు తగ్గట్టుగా భక్తులు వస్తున్నారు. దాంతో అధికార యంత్రాంగంలోనూ ఉత్సాహం కన్పిస్తోందిప్పుడు. తొలి రోజు ఇచ్చిన షాక్‌తో కంగారు పడ్డ చంద్రబాబు, రెండో రోజు తర్వాత పెరిగిన పుష్కర యాత్రీకులతో ఇప్పుడు కాస్త ఆనందంగానే కన్పిస్తున్నారు. 

గోదావరి పుష్కరాలతో కృష్ణా పుష్కరాల్ని పోల్చి చూడటమే ఇక్కడ చంద్రబాబు చేసిన అతి పెద్ద తప్పు. ఆశించడం, భంగపడ్డం ఎందుకట.? పైగా, విజయవాడ ఇరుకునగరంగా ఇప్పటికే విమర్శల్ని ఎదుర్కొంటోంది. పరిస్థితుల్ని అంచనా వేసి, ఏర్పాట్లు చేయడం మానేసి, పబ్లిసిటీ హోరెత్తించేసి, ఆ స్థాయిలో జనం రావాలని అంచనా వేసేసి బొక్క బోర్లా పడాల్సి వచ్చింది చంద్రబాబుకి. 

ఇప్పుడు ఇబ్బంది ఏమీ లేదు. జనం వస్తున్నారు, విజయవాడ నగరంలో సందడి కన్పిస్తోంది. కర్నూలు, గుంటూరు జిల్లాల్లోనూ పుష్కరాల సందడి కన్పిస్తోంది. ఇప్పుడే అధికార యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేయాల్సి వుంటుంది. ఎండల కారణంగా పుష్కర యాత్రీకులు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు. నీడ లేక నానా తంటాలూ పడుతున్న యాత్రీకులకు ఊరటనిచ్చే ఏర్పాట్లు లేకపోవడం ఇబ్బందికరమే. 

ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, తెలంగాణలోనూ ఎండలు మండిపోతున్నాయి. దాంతో ప్రభుత్వాలకి ఈ పుష్కరాలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడ్తున్నాయి. పుష్కర యాత్రీకులు వడదెబ్బతో ఇబ్బందులు పడ్తోంటే, వారి నిరసనల మధ్య అధికారులు కిందా మీదా పడాల్సి వస్తోంది. ఏదిఏమైనా, పుష్కరాల్లో పెరిగిన భక్తులతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పుష్కర జాతర తాలూకు సందడి పదింతలయ్యిందన్నది నిర్వివాదాంశం. అయితే ఈ సందడి ముందు ముందు కూడా కొనసాగుతుందా.? సెలవుల సీజన్‌ అయ్యాక తగ్గుముఖం పడ్తుందా.? వేచి చూడాల్సిందే. 

కొసమెరుపు: తొలి రోజు పుష్కరాల్లో భక్తులు ఎక్కువగా కన్పించలేదని, ఆ అక్కసునంతా చంద్రబాబు జగన్‌ మీద వెల్లగక్కేశారు. ఏంటో, అన్నిటికీ చంద్రబాబుకి వైఎస్‌ జగనే గుర్తుకొస్తారు. అంతలా జగన్‌, చంద్రబాబుని వెంటాడుతున్నారని అనుకోవాలా.?

Show comments