నీరు - నిప్పు: తెలుగు రాష్ట్రాల్లో కూడానా.?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో దాదాపు అన్ని నీటి ప్రాజెక్టులూ నిండు కుండల్లా మారిపోయాయి. ఇటు కృష్ణా నది నుంచీ, అటు గోదావరి నది నుంచీ వృధాగా లక్షలాది క్యూసెక్యుల నీళ్ళు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇన్నాళ్ళూ లేక బాధ.. ఇప్పుడు వుండీ బాధ. అంతే తేడా.! రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు మాత్రం చల్లారడంలేదు. 

పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని ఆంధ్రప్రదేశ్‌ అక్రమంగా ఎత్తుకుపోతోందన్నది తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణ. లెక్కా పత్రం లేకుండా నీటిని ఆంధ్రప్రదేశ్‌ దోచేస్తోంటే, ఆ కారణంగా శ్రీశైలం నుంచి నీళ్ళు కిందికి వదిలినా, నాగార్జునసాగర్‌లోకి నీరు చేరడంలేదని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు గుస్సా అవుతున్నారు. పోతిరెడ్డిపాడు వివాదం ఈనాటిది కాదు. ఎప్పటినుంచో వున్నదే. 

అయినా, నీటి పంపకాల వివాదంపై కేంద్రం, ఇటీవలే ఇరు రాష్ట్రాలతోనూ సంప్రదింపులు జరిపింది. ఓ పరిష్కారం దిశగా కేంద్రం కూడా సమాలోచనలు చేస్తోంది. ఇరు రాష్ట్రాలూ ఒకే వేదికపై కూర్చుని మాట్లాడుకున్నాయి గనుక, ఇప్పుడు సంయమనం అవసరం. ఏపీ దోపిడీపై తమకు పూర్తి సమాచారం వుందంటున్న తెలంగాణ మంత్రి హరీష్‌రావు, ఆ వివరాల్ని మాత్రం అధికారికంగా వెల్లడించడంలేదు. ఆంధ్రప్రదేశ్‌ దొంగలెక్కలు చెబుతోందని మాత్రమే ఆయన ఆరోపిస్తున్నారు. 

షరామామూలుగానే ఆంధ్రప్రదేశ్‌ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, హరీష్‌రావు ఆరోపణల్ని కొట్టి పారేస్తున్నారు. 'అన్ని లెక్కలూ పక్కాగా వున్నాయి.. కావాలంటే చూస్కోండి..' అంటూ హరీష్‌రావుకి ఉచిత సలహా ఇచ్చారు. ఇక్కడితో ఆ వివాదం సద్దుమణిగితేనే మంచిది. లేదంటే, ఈ వివాదం రెండు రాష్ట్రాల మధ్య సంబంధాల్ని దెబ్బతీసేంతలా ముదిరిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

కృష్ణా నదిలోకి వస్తున్న నీటి ప్రవాహం చాలా ఎక్కువగానే వుంటుందనే అంచనాలు వెల్లువెత్తుతున్న వేళ, హరీష్‌రావు తొందరపడి ఆరోపణలు చేస్తున్నారేమో అన్న అనుమానాలే ఎక్కువగా విన్పిస్తున్నాయి. కర్నాటక నీటిని విడుదల చేసినా, ఏపీ దోచుకుంటోంది.. అన్న మాట ఒకింత ఇబ్బందికరంగానే తయారయ్యింది. నేతల తొందరపాటు ప్రకటనలతో పరిస్థితులు ఎంత ఉద్రిక్తంగా మారిపోతాయో కర్నాటక - తమిళనాడు రాష్ట్రాల మధ్య వాతావరణం చూస్తే అర్థమవుతుంది. 

అక్కడిదాకా ఎందుకు, గతంలో నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ మీద తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ రైతులు, అధికారులు కొట్టుకున్న విషయాన్ని ఎలా మర్చిపోగలం.?

Show comments