పోస్ట్ మార్టమ్ లు వద్దు సుధీర్

సినిమా విఫలమయిన తరువాత, ఆ వైఫల్యంలో తమ పాత్ర వుందీ అని తెలిసిన తరువాత మరి కెలక్కూడదు. తప్పు నాది కాదు పక్కోడిది అనే టైపులో మాట్లాడకూడదు. ఎందుకంటే హత్యలకు, ఆత్మహత్యలకు పోస్ట్ మార్టమ్ లు వుంటాయి కానీ, సహజ మరణాలకు కాదు. దోచేయ్ సినిమాది సహజ మరణం. దానికి ఎవరూ ఏమీ చేయలేరు. విదేశీ సినిమాలను చూసి ఇన్ స్పయిరై, ఆయా డైరక్టర్లకు క్రెడిట్ లైన్ ఇచ్చే గొప్పమనసు దర్శకుడు సుధీర్ వర్మది. మరి అలా ప్రభావితం కావడం అనేది అలావాటై, తన స్వామిరారాకు తానే ప్రభావితమై తీసిన సినిమా దోచేయ్.

అయితే ఇప్పుడు కేశవ ప్రీ రిలీజ్ ఇంటర్వూల్లో సుధీర్ ఏమంటున్నారు''..దోచేయ్ మరీ బ్యాడ్ ఫిల్మ్ యేమీ కాదు. అలా అని గొప్ప సినిమా అనను. కానీ డీసెంట్ సినిమా అది. అయితే సరైన మార్కెటింగ్ లేకపోవడం, సరైన రిలీజ్ టైమ్ కాకపోవడం వంటివి ఆ సినిమాను ఫెయిల్ చేసాయి..'' అంటున్నారు. ఈ మాట వింటే పాపం ఈ సినిమా కారణంగా కుదేలయిన నిర్మాత బోగవిల్లి ప్రసాద్ ఏమంటారో? దోచేయ్ బాగా వసూళ్లు చేయకపోవచ్చు కానీ, దర్శకుడిగా తన ఫెయిల్యూర్ ఎంతమాత్రం లేదంటున్నారు. పైగా దోచేయ్ తరువాత తనకు అనేకమంది హీరోలు, నిర్మాతలు ఆఫర్లు ఇస్తూ ఫోన్ లు కూడా చేసారంటున్నారు సుధీర్ వర్మ.

మరి అదే నిజమైతే, 2015 నుంచి, 2017 దాకా సుధీర్ ఖాళీగా వుండిపోవాల్సి వచ్చింది ఎందుకో? ఛాన్స్ ఇస్తానన్న రవితేజ ఎందుకు తప్పుకున్నట్లో? రవితేజ బిజీ కావడం వల్లనే అని సుధీర్ అంటున్నారు. కానీ రవితేజ కిక్ 2, బెంగాల్ టైగర్ ( రెండూ ర2015) నుంచి ఇప్పటి దాకా ఖాళీగానే వున్నారు కదా? పోనీ రవితేజ కాకుంటే దోచేయ్ తరువాత ఫోన్ చేసిన హీరోలు చాలా మందే వున్నారంటున్నారు కదా?

ఇంతకీ ఇదంతా ఎందుకు అంటే, సినిమా అభిమానులు అన్నీ గమనిస్తుంటారు. ఏం మాట్లాడినా, ఏం చేసినా. అందువల్ల ఇంటర్వూల్లో పోస్టు మార్టమ్ లు చేయకుండా వుంటే, ఇలాంటి క్వశ్చన్లు సినిమా అభిమానులు వేయకుండా వుంటారు.కేశవ సినిమాతో సుధీర్ మళ్లీ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారని ఆశిద్దాం.

Show comments