కేసీఆర్‌, చంద్రబాబు మ్యాచ్‌ ఫిక్సింగ్‌

'చంద్రబాబు హైద్రాబాద్‌ని వీడి, విజయవాడకు వెళ్ళడం మంచిదే.. అక్కడ పాలన మెరుగుపడుతుంది.. పైగా అక్కడి ప్రజలకు ముఖ్యమంత్రి అందుబాటులో వుంటారు..' 

- నిజామాబాద్‌ ఎంపీ, టీఆర్‌ఎస్‌ నేత కవిత 

'చాలా విషయాల్లో ఆంధ్రప్రదేశ్‌తో భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాం.. ఎంతైనా అన్నదమ్ములం కదా..' 

- తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారారావు 

'చంద్రబాబుని ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు..' 

- తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 

కవిత, కేటీఆర్‌ స్టేట్‌మెంట్లు కొత్తవి. కేసీఆర్‌ స్టేట్‌మెంట్‌ కాస్త పాతది. కాలం మారింది.. అందుకే నేతల వాయిస్‌ కూడా మారింది. మొన్నటికి మొన్న తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ మధ్య నీటి పంపకాల వివాదంలో మంత్రి హరీష్‌రావు, ఏ స్థాయిలో చంద్రబాబు మీద దుమ్మెత్తి పోశారో గుర్తుంది కదా.! ఏంటీ వైపరీత్యం.? అప్పటికప్పుడే తీవ్రమైన ధూషణలు.. అంతలోనే, మెచ్చుకోలు. తెరవెనుక ఏదో జరుగుతోంది. అదేంటది.? 

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ వ్యవహారానికి సంబంధించి కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ - తెలంగాణ రాష్ట్రాలకి ఒకే ర్యాంక్‌ ఇచ్చింది. అదీ నెంబర్‌ వన్‌ ర్యాంక్‌. అదెలా.? ఒకరికి మొదటి ర్యాంకు, ఇంకొకరికి రెండో ర్యాంక్‌ రావాలి కదా.! దేశంలో ఇంకే ఇతర రాష్ట్రానికీ ఈ వెసులుబాటు కలగలేదు. ఒక్క తెలుగు రాష్ట్రాలకే ఈ ఛాన్స్‌ దక్కింది. ఇది చిత్రమే. బహుశా రెండు తెలుగు రాష్ట్రాల్నీ ఏకం చేయడానికి (కలిపేయడానికి కాదు, రెండు రాష్ట్రాల మధ్యా విభేదాలు తగ్గించేందుకు) కేంద్రం ఈ ప్రతిపాదన చేసిందేమో.! 

అదలా వుంచితే, నెంబర్‌ వన్‌ పొజిషన్‌లోకి వచ్చిన (కాస్సేపు అనుకుందాం) చంద్రబాబు, తెలంగాణను దగ్గర చేసుకునేందుకు (ఓటుకు నోటు ఎఫెక్ట్‌తో) నెంబర్‌ వన్‌ పొజిషన్‌ని తెలంగాణతో షేర్‌ చేసుకున్నారేమో.! ఎందుకంటే, గతంలో తెలంగాణకి వచ్చిన ర్యాంక్‌ 13. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌కి రెండో ర్యాంక్‌ వచ్చింది. అదే అప్పట్లో పెద్ద వివాదాస్పద అంశంగా మారింది. ఆ తర్వాత తమ విధానాల్ని ఆంధ్రప్రదేశ్‌ కాపీ కొట్టిందని తెలంగాణ, అంత ఖర్మ తమకు పట్టలేదని ఆంధ్రప్రదేశ్‌ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకున్నార్లెండి.. అది వేరే విషయం. 

కారణాలేవైతేనేం, తెలుగు రాష్ట్రాలు నెంబర్‌ వన్‌ స్థానాన్ని 'పంచుకుంటున్నాయి'. ఎవరు ఎవరితో రాజీ పడ్డారనే విషయం పక్కన పెడితే, 'రాజీ' అన్నది సుస్పష్టం. అందుకే, నేతల నాలిక మడతబడ్తోంది. మొదటి నుంచీ ఇంతే. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చేస్తానన్న చంద్రబాబు, చంద్రబాబుని జైల్లో పెట్టిస్తానన్న కేసీఆర్‌.. ఇద్దరూ కాంప్రమైజ్‌ అయిపోయారు. మధ్యలో వీళ్ళను గుడ్డిగా నమ్మే ఆయా పార్టీల్లోని నేతలు, కార్యకర్తలే వెర్రి వెంగళప్పలనుకోవాలా.?

Show comments