విశ్వనటుడు కమల్‌హాసన్, తమిళ రాజకీయాలపై పెద్ద బాంబు పేల్చాడు. 'నేను నిర్ణయించుకుంటే నేనే నాయకుడ్ని..' అంటూ ఓ కవితను కమల్‌హాసన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. తమిళంలోనే ఓ పెద్ద కవితను కమల్ పోస్ట్ చేశాడు.
ఆ కవితను చదివితే, తమిళనాడుకి ముఖ్యమంత్రి కావాలన్న ఆయన బలమైన కోరిక కన్పిస్తుంది అందులో ఎవరికైనా. 'నన్ను ఎవరైనా ఓడించాలనుకుంటే, ఇంకా బలంగా తయారవుతా..' అని ఆ కవితలో పేర్కొనడమే కాదు, ఎవరికీ తలవంచేది లేదని తెగేసి చెప్పాడు. తనకు మద్దతిచ్చేవారంతా సంసిద్ధంగా వుండాలనీ పేర్కొన్నాడు కమల్‌హాసన్.
గత కొన్నాళ్ళుగా కమల్‌హాసన్ పొలిటికల్ స్టేట్‌మెంట్లు దంచేస్తున్నాడు ట్విట్టర్‌లో. సగటు భారతీయుడిగా, సగటు తమిళ వ్యక్తిగా.. అంటూ కొన్ని పొలిటికల్ కామెంట్లు కమల్ చేస్తున్నా, రాజకీయాలపై ఆయనకున్న ఆలోచనల్ని ఆ ట్వీట్లు స్పష్టం చేస్తున్నాయి. 'నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు. కానీ, ఓ పౌరుడిగా రాజకీయ వ్యవస్థను ప్రశ్నిస్తా..' అంటూ మీడియా ముందుకొచ్చి కమల్ చాలా సందర్భాల్లో చెప్పాడు. మీడియా డిస్కషన్స్‌లోనూ పాల్గొంటున్నాడు.
ఈ మధ్యకాలంలో అయితే కమల్ చుట్టూ, తమిళనాడులోని అధికార పార్టీ అన్నాడీఎంకే (శశికళ వర్గం) పెద్ద రచ్చే చేస్తోంది. కమల్‌హాసన్‌కి రాజకీయ బెదిరింపులూ షురూ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే, కమల్ నోట 'నాయకత్వం' అన్న మాట వచ్చిందనుకోవాలి.
మరోపక్క, రాజకీయ రంగ ప్రవేశంపై రజనీకాంత్ ఇంకా గందరగోళం కొనసాగిస్తుండడం కమల్‌కి కలిసొచ్చే అంశమే. రజనీ ఎటూ రాజకీయాలపై నాన్చుడు వైఖరి కొనసాగిస్తున్నారు గనుక, తమిళనాడులో పొలిటికల్ వాక్యూమ్‌ని కమల్ తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.