మెగా'స్టార్‌డమ్‌' అలా ఆశించగలమా.?

అమితాబ్‌ బచ్చన్‌.. అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ మెగాస్టార్‌. వయసు మీద పడ్తోన్న కొద్దీ, వయసుకు తగ్గ పాత్రల్లో ఒదిగిపోవడం అలవాటు చేసుకున్నారాయన. ఓ 'మూస చట్రం'లో ఎప్పుడూ అమితాబ్‌ బచ్చన్‌ ఇరుక్కుపోలేదు. అందుకేనేమో, ఇప్పటికీ ఆయన స్టార్‌డమ్‌ అలానే వుంది. అమితాబ్‌ బచ్చన్‌ నుంచి సినిమా వస్తోందంటే చాలు, ఆ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతాయి. చిన్న సినిమాలకు సైతం అమితాబ్‌ ఇమేజ్‌ గెస్ట్‌ అప్పీయరెన్స్‌ అయినాసరే, పెద్ద ఊపు వచ్చేస్తుంటుంది. 

సౌత్‌లో, అందునా టాలీవుడ్‌లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాతో తన స్టార్‌డమ్‌ని మరోమారు నిరూపించుకున్నారాయన. డాన్సులేశారు, ఫైట్స్‌ చేసేశారు, కామెడీతో ఆకట్టుకున్నారు.. ఓవరాల్‌గా అభిమానుల్ని ఓ రేంజ్‌లో అలరించారు. తొమ్మిదేళ్ళ గ్యాప్‌ తర్వాత వస్తూనే, 100 కోట్లతో బాక్సాఫీస్‌ వద్ద తన సత్తాను చాటుకున్నారు చిరంజీవి. ముందు ముందు కూడా చిరంజీవి నుంచి ఇలాంటి సినిమాలే ఆశించాలా.? ఇది సహజంగానే తలెత్తే ప్రశ్న. ప్రతి సినిమాలోనూ చిరంజీవి డాన్సులు, ఫైట్లు, కామెడీ.. ఇంతేనా.? ఇంతకు మించి ఇంకేమీ వుండదా.? అన్న అనుమానం అందరికీ కలుగుతోంది. 

'దంగల్‌' లాంటి సినిమాలు తెలుగులో రావాలని చిరంజీవి ఆకాంక్షించారు ఓ సందర్భంలో. అమితాబ్‌ బచ్చన్‌లా విభిన్నమైన కథల్ని ఎంచుకోవాల్సిన బాధ్యత తనమీద వుందని చెప్పుకొచ్చారాయన. కానీ, చిరంజీవి అలా తనను తాను మార్చుకోగలరా.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఎప్పుడూ చిరంజీవి ఇలాగే డాన్సులు చేస్తారని, అభిమానుల్ని అలరిస్తారనీ అనుకోలేం. వయసుకు తగ్గ పాత్రల్ని ఎంచుకుంటూనే, ఇతర హీరోలతో కలిసి నటించడం, యంగ్‌ హీరోల సినిమాల్లో 'వెయిట్‌ వున్న పాత్రల్ని' పోషించడం.. ఇలా సరికొత్త మార్గంలో అడుగులేసేందుకు చిరంజీవికి ఇదే రైట్‌ టైమ్‌ అన్నది నిర్వివాదాంశం. 

'శతమానంభవతి' సినిమాకి సంబంధించిన ఈవెంట్‌కి చిరంజీవి హాజరవడం, చిన్న సినిమా విజయాన్ని ఆయన హర్షించడం.. ఇవన్నీ చూశాక, చిన్న హీరోలతో కలిసి చిరంజీవి వెండితెరను పంచుకోవాలనీ, తద్వారా చిన్న సినిమాలకు తన స్టార్‌డమ్‌ని అద్దాలనీ సినీ పరిశ్రమ నుంచి అభిప్రాయాలు కాస్త గట్టిగా వినబడుతున్నాయిప్పుడు. మల్టీస్టారర్‌ సినిమాలు, విభిన్న కథాంశంతో తెరకెక్కే సినిమాలు, చిరంజీవి నుంచి ఆశించేవారి సంఖ్య ఎక్కువవుతోంది. ఇంతకీ, చిరంజీవి నుంచి అవన్నీ ఆశించగలమా.? వేచి చూడాల్సిందే. Readmore!

Show comments