లారెన్స్‌ రూటు మార్చేశాడు

ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు, నటుడు లారెన్స్‌ రాజకీయాల్లోకి వస్తానంటున్నాడు. నాలుగైదు రోజుల క్రితమే, 'రాజకీయాలు నాకు సరిపడవు..' అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన లారెస్స్‌, అవసరమైతే రాజకీయాల్లోకి వస్తానంటూ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమిళనాడులో జల్లికట్టు కోసం జరుగుతున్న పోరాటంలో, సినీ రంగం నుంచి లారెన్స్‌ పేరు ప్రముఖంగా విన్పించిన విషయం విదితమే. ప్రత్యక్షంగా జల్లికట్టు ఆందోళనల్లో పాల్గొన్నాడు లారెన్స్‌. 

తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో స్టార్‌ కొరియోగ్రాఫర్‌గా లారెన్స్‌ పేరు ప్రఖ్యాతులు గడించాడు. అంతేనా, దర్శకుడిగానూ, హీరోగానూ సక్సెస్‌ అయ్యాడు. దాంతో, లారెన్స్‌కి సినీ ప్రముఖుడిగా మంచి ఫాలోయింగే ఏర్పడింది. దాన్నిప్పుడు పొలిటికల్‌గా క్యాష్‌ చేసుకునే పనిలో లారెన్స్‌ వున్నాడన్నమాట. ఎటూ, జల్లికట్టు ఉద్యమం పేరుతో లారెన్స్‌కి పొలిటికల్‌ మైలేజీ కూడా బాగానే కన్పిస్తోంది. 

తమిళనాడు రాజకీయాల్లో సినీ గ్లామర్‌ చాలా ఎక్కువ. ప్రస్తుతానికైతే, తమిళనాడు రాజకీయాల్లో చాలామంది సినీ ప్రముఖులున్నారు వివిధ పార్టీల్లో. ఇంకోపక్క, మొన్నీమధ్యనే, హీరో అజిత్‌కి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్‌ వచ్చింది. కానీ, ఆయన దాన్ని కాదనుకున్నాడు. అంతెందుకు, రజనీకాంత్‌కి తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం వచ్చినా బెదిరిపోయాడాయన.  విజయ్‌కాంత్‌ రాజకీయ పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్న విషయం విదితమే. శరత్‌కుమార్‌ కూడా రాజకీయ పార్టీ పెట్టేసి, ఏం చేయలేక ఖాళీగా కూర్చున్నాడాయన. కొందరు మాత్రం, ఏదో ఒక పార్టీలో చోటు చూసుకుని, సెటిలైపోయారనుకోండి.. అది వేరే విషయం.

మరి, కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకైనా సిద్ధమంటున్న లారెన్స్‌, రాజకీయాల్లోకి వెళ్ళి చేతులు కాల్చుకుంటాడా.? ఏమో మరి, వేచి చూడాల్సిందే. Readmore!

Show comments